6 నెలలైనా పూర్తి కాని బ్రిడ్జ్.. బోల్తా కొడుతున్న వాహనాలు

Update: 2024-10-14 05:56 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ధాన్యం లారీ బోల్తా పడింది. ఈ ఘటన రామారెడ్డి గంగమ్మ వాగు వద్ద చోటుచేసుకుంది. రామారెడ్డి నుంచి కామారెడ్డి వైపు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ గంగమ్మ వాగు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోయినా.. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. గంగమ్మ వాగు బ్రిడ్జి ప్రమాదకరంగా ఉండటంతో ప్రభుత్వం నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఎన్నో నెలలుగా బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో తాత్కాలిక రోడ్లపై ప్రయాణించాల్సి వస్తోంది. ఈ రోడ్లను కూడా అధికారులే ఏర్పాటు చేశారు. అయితే కేవలం ఒక్క వాహనం మాత్రమే వెళ్లేలా రోడ్డు ఉండటంతో రాకపోలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాత్కాలిక రోడ్డు రెండు మూడు సార్లు కొట్టుకుపోతే అటువైపు రాకపోకలను నిలిపివేశారు. ఆ సమయంలో స్థానికులంతా కలిసి కలెక్టర్‌కు తమ సమస్యను వివరించడంతో 15 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటికీ బ్రిడ్జి పూర్తి కాలేదు. దానికి బదులుగా తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేసినా రోడ్డుకు ఓ పక్కన గొయ్యి ఉండడంతో భయంభయంగా వాహనదారులు వెళ్తున్నారు. ఇక తాజాగా ధాన్యం లారీ బోల్తా పడడంతో స్థానికుల ఆగ్రహం తారస్థాయికి చేరింది. నెల గడిచి పోతున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని, ప్రమాదాలు జరిగితేనే బ్రిడ్జి నిర్మాణం చేస్తారా? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. 

Similar News