Minister Konda Surekha : పోడు భూముల పంపిణీ పై సమగ్ర వివరాలు ఇవ్వండి
పోడు భూముల పంపిణీ కి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లకు సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఆగస్టు 17: పోడు భూముల పంపిణీ కి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తో కలిసి శనివారం మంత్రి కొండా సురేఖ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు పోడు పట్టాల కోసం వచ్చిన క్లెయిములు ఎన్ని, వాటిలో ఎంతమందికి ఎన్ని ఎకరాల భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఇంకా ఎన్ని క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయి, అందుకు గల కారణాలు ఏమిటి, పట్టాలు పొందిన వారికి భూమి హద్దులు చూపించారా తదితర వివరాలను ఒక్కో జిల్లా వారీగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రెండు విడతలుగా రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ జరిగినప్పటికీ, ఇంకా పలుచోట్ల గిరిజనుల నుంచి వినతులు వస్తున్నాయన్నారు.
నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోడు భూములు, పట్టాల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను నిర్ణీత గడువులోపు పంపించాలని మంత్రి సూచించారు. వీటిపై ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. పోడు భూములకు సంబంధించి భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అయితే, ఎక్కడ కూడా అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేత జరగకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు.
అడవుల నరికివేత వల్ల కలిగే నష్టాల గురించి అటవీ, సరిహద్దు ప్రాంతాల ప్రజలందరిలో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాగా, సిరికొండ మండలం రావుట్లలో అటవీ భూమిని కొంతమంది యథేచ్ఛగా చెట్లు నరికివేసి కబ్జాలకు పాల్పడుతున్నారని వీ.సీలో పాల్గొన్న సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రికి ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ, వెంటనే అదనపు కలెక్టర్ ను పంపించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపిస్తామని, సమగ్ర వివరాలతో నివేదిక పంపిస్తామని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పోడు భూముల సమస్య నెలకొని ఉందని, అర్హులైన వారికి న్యాయం చేయాలని మంత్రిని కోరారు. అదేవిధంగా మారుమూల గిరిజన తండాలు, అటవీ సరిహద్దు గ్రామాలకు రవాణా వసతిని మెరుగుపర్చేందుకు రోడ్లు నిర్మించాలని, తాగునీటి వసతి వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగూర్ రావు, అటవీ శాఖ డివిజనల్ అధికారి భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.