ఉపాధిహామీ పనుల్లో నీటి వనరులపై దృష్టి సారించాలి

ఉపాధి హామీ పథకంలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-03-14 14:15 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : ఉపాధి హామీ పథకంలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని గురువారం ఉపాధి హామీ పథకంపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీలో భాగంగా నీటి నిల్వ కుంటలు,( రీఛార్జ్ ఫీట్లు)పర్కులేషన్ ట్యాంకులు, కంటూర్ కందకాలు కూలీలతో తవ్వించి భూగర్భ జలాల పెంపునకు దోహదపడాలని తెలిపారు.

    ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా మండల స్థాయి అధికారులు చూడాలని కోరారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించి, జాబ్ కార్డ్ ఉన్న కూలీలకు పనులు కల్పించాలని చెప్పారు. చెరువులలో పూడిక మట్టి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని, పూడిక తీసిన మట్టిని రైతుల పంట పొలాలకు పంపించాలని సూచించారు. గ్రామాల్లో సాగునీటి కాలువలలో కూలీలతో పూడిక తీయించాలని తెలిపారు. కూలీలకు ఉపాధితో పాటు, రైతుల పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందే వీలు కలుగుతుందని చెప్పారు. మండలాల వారీగా ఉపాధి హామీలో జరుగుతున్న పనులు, వస్తున్న కూలీల సంఖ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ చందర్ నాయక్, ఏపీవోలు, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. 


Similar News