ఈనెల 21 న ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది.

Update: 2024-03-15 15:07 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈనెల 21వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఆర్మూర్ మున్సిపల్ అధికారులకు అందాయి. ఈనెల 18వ తేదీన మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులందరికీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల కోసం నోటీసులు అందించా లంటూ ఆదేశాలు వచ్చాయి. గత బీఆర్ఎస్ పాలనలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పండిట్ వినీత పవన్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన తొలి ప్రయత్నంలోనే పదవిని అందుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా సుమారు నాలుగు సంవత్సరాలకు పైగా పండిత్ వినీత పవన్ సేవలందించారు.

     కానీ ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటమి తర్వాత ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ స్వపక్షం లోనే విపక్షంగా కూటమి కట్టి చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ పై గత ఏడాది చివరి నెలలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తెలిసిందే. దీంతో ఈ ఏడాది జనవరి 4న ఆర్మూర్ మున్సిపల్ లో అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మాన సమావేశం తొలుత నెగ్గిందని అధికారులు ప్రకటించినా అటు తరువాత అవిశ్వాస తీర్మాన విషయంలో పలు నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పొందేందుకు మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యప్ప లావణ్య శ్రీనివాస్, కండేష్ సంగీత శ్రీనివాస్ లు విశ్వప్రయత్నాలు చేశారు.

    మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సమక్షంలో చర్చలు జరిపారు. కానీ అంతకుముందు చైర్ పర్సన్ పండిట్ వినీత పవన్ ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి మంత్రాంగంతో కోర్టు మెట్లు ఎక్కి ఆర్డర్ తో తిరిగి చైర్ పర్సన్ గా పదవిలో కొనసాగారు. ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు 16 మంది చేసేదేమీ లేక మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నతో కలిసి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆర్మూర్ చైర్పర్సన్ ఎన్నిక కోసం ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తీవ్ర మంత్రాంగం చేసి మున్సిపల్ ఉన్న తాధికారుల చేత ప్రకటన చేయించడంతో మున్సిపల్ చైర్స్ పర్సన్ పదవిని ఆశిస్తున్న కౌన్సిలర్లు సఫలీ కృతులయ్యారు.

     బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆర్మూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య బలం భారీగా పెరగడంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం తేదీని మున్సిపల్ అధికారులు ఖరారు చేశారు. ఆర్మూర్ మున్సిపల్ ను హస్త గతం చేసుకునేందుకు సరిపడా సంఖ్యాబలం కాంగ్రెస్ చేతిలో ప్రస్తుతం ఉండడంతో ఆర్మూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరి హస్తగతం అవనుంది. ఆర్మూర్ మున్సిపల్ లో నూతన చైర్పర్సన్ ఎవరు కానున్నారనే చర్చ ఆర్మూర్ లో జోరుగా సాగుతుంది. చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్న కాందేశ్ సంగీత శ్రీనివాస్, అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ లలో ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్న ఇరువురు కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిలర్ల తో శిబిరాలకు శుక్రవారం సాయంత్రం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.


Similar News