'దిశ'ఎఫెక్ట్ : దళిత స్టూడెంట్ ను తిరిగి బడిలో చేర్చుకున్న ప్రధానోపాధ్యాయుడు
దిశ, నాగిరెడ్డిపేట : ఓ దళిత విద్యార్థికి బలవంతంగా టీసి ఇచ్చి పంపిన ప్రధానోపాధ్యాయుడే.. తిరిగి అదే దళిత స్టూడెంట్ ను పాఠశాలలో చేర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదే గ్రామానికి చెందిన బందెల రవి అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. గత కొద్దిరోజులుగా బందెల రవికి జ్వరం రావడంతో పాఠశాలకు గైర్హాజరు అయ్యాడు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరాజు విద్యార్థి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి బందెల రవికి "నీకు చదువు రాదు, నీవు ఎక్కడ చదివినా పరీక్షల్లో ఫెయిల్ అవుతావు" అంటూ బుధవారం పాఠశాలలో రవికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించాడు.
ఇదే ఘటనపై "దళిత విద్యార్థులు చదువుకు పనికిరారా? విద్యార్థికి టిసి ఇచ్చి పంపించిన ప్రధానోపాధ్యాయుడు" అనే శీర్షికతో బుధవారం ‘దిశ’ దిన పత్రికలో కథనం వెలువడింది. దీంతో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అట్కారి బబ్లూ, నాగిరెడ్డిపేట మండల అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మీదే బాబురావులు స్పందించారు.
విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి, అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయున్ని టీసీ ఇచ్చి పంపించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇకముందు ఇలాంటి పొరపాట్లు పిల్లలపై జరగకూడదని ప్రధానోపాధ్యాయులకు హెచ్చరించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటరాజు స్పందించి అలా జరగదని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులపై కచ్చితంగా శ్రద్ధపెట్టి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తామని చెప్తూ.. ఆ విద్యార్థిని తిరిగి పాఠశాలలో చేర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి డివిజన్ కోశాధికారి సాయిబాబా, మండల అధ్యక్షులు అమృత్ రావు, ప్రధాన కార్యదర్శి కుసులకంటి సాయిలు, నాయకులు మహేందర్, చందు మరియు గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.