Rural MLA: ఓర్వలేనితనంతోనే విమర్శలు

రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందాలు నింపుతుంటే, బీ ఆర్ ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి అన్నారు.

Update: 2024-08-17 12:14 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందాలు నింపుతుంటే, బీ ఆర్ ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను100 శాతం అమలు చేస్తుంటే మా దుకాణం ఎక్కడ మూత పడుతుందోనని బీ ఆర్ ఎస్ నేతల్లో వణుకు మొదలైందని భూపతి రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం మూడు విడతల్లో ఏకకాలంలో రుణమాఫీ పూర్తిస్థాయిలో చేసిందని ఆయన అన్నారు.

దీన్ని చూసి ఓర్వలేక బి ఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని భూపతి రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రైతులకు ఏ విధంగాను ఆదుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అర్హులైన రైతులందరి రుణాలను ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయనన్నారు.

రైతు కష్టాలు తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పించి రైతులకు బాసటగా నిలుస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసే ముందు మీ ప్రభుత్వ హయాంలో మీ కుటుంబానికి తప్ప ప్రజలకు ఏం చేశారని ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గానీ, సీఎం రేవంత్ రెడ్డిని గాని విమర్శించే హక్కు బి ఆర్ ఎస్ పార్టీకి లేదని భూపతి రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నగర అధ్యక్షులు కేశవేణు తదితరులు పాల్గొన్నారు.


Similar News