కాంగ్రెస్ పార్టీ 80 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తాం

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని, ఈ నెల కేసీఆర్ ఉంటే 2 వేలు, ఆయన్ని బొంద పెడితే నాలుగు వేల పెన్షన్ అని పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-22 15:57 GMT

దిశ, నిజామాబాద్ రూరల్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని, ఈ నెల కేసీఆర్ ఉంటే 2 వేలు, ఆయన్ని బొంద పెడితే నాలుగు వేల పెన్షన్ అని పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం లోని ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ తాము కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూయించి ఓట్లు అడుగుతాం, మీరు కట్టిన కాలేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టును చూపించి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం మీకు ఉందా అన్నారు. ముడెళ్లకే మేడిగడ్డ కూలిపోయిందని, అన్నారం పగిలిపోయిందని, ఏ ముఖంతో ప్రజలను ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. లక్ష యాభై వేల కోట్లు ఖర్చుపెట్టిన కాలేశ్వరం ప్రాజెక్టును నువ్వు చూపించు, శ్రీరామ్ సాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను చూపించి మేము ఓట్లు అడుగుతామన్నారు. ఎండ కొడుతున్నా, కడుపు మాడుతున్నా భూపతి రెడ్డిని గెలిపించడం కోసం ఉన్న ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. బీఆర్ఎస్ కు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారని, ప్రజలను మోసం చేశారు తప్ప ప్రజలకు చేసింది ఏమీలేదని అన్నారు.

    లంబాడ సోదరులను ఆదుకోలేదని, పోడు భూముల పట్టాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. దర్పల్లి కి వంద పడకల ఆస్పత్రి ఇవ్వలేదని, ఆనాడు ఎంపీ గా ఉన్న కవిత మీ సమస్యలు చూడలేదని, వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు తెరవలేదన్నారు. కేసీఆర్ కట్టినట్టు ఫామ్ హౌజ్ కట్టుకున్న ఘనత బాజిరెడ్డి దే అన్నారు. ఎర్ర జొన్న రైతుల మీద కేసులు నమోదైతే ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కి 20 సీట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్ మాట్లాడడం చూస్తుంటే మతితప్పినట్టు అర్ధం అవుతుందన్నారు. 2023 ఎలక్షన్ లో 80 సీట్లకు పైగా సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని అన్నారు. పసుపు రైతాంగానికి బోర్డ్ తెస్తనన్న గుండోడు ఎటో పోయిండని అన్నారు. ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టకున్న బాజిరెడ్డిని పాతి పెట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా ఎవరి వైపు ఉంటే అదే ప్రభుత్వం వస్తదన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇస్తామన్న కాంగ్రెస్ ను నమ్ముతారా, దొరల రాజ్యం తెస్తామన్న కేసీఆర్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే డిసెంబర్ 9న 6 గ్యారంటీ లతో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఒకటో తేదీన మహిళల ఖాతాలో 2500 నగదు జమ అవుతుందని అన్నారు.

    500లకు సిలిండర్ ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. ప్రతి మహిళకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించనున్నామన్నారు. రైతన్నలకు బాయి కాడ ఇంటి కాడ ఉచిత 24 గంటలు కరెంట్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకుందని అన్నారు. రైతు బరోసా పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి 15 వేలు, కౌలు రైతుకు కూడా 15 వేలు అందించనున్నామన్నారు. ప్రతి పేద వానికి భూమి లేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు అందజేయనున్నామని అన్నారు. విద్యార్థులకు బ్యాంక్ గ్యారంటీ కార్డు ద్వారా చదువుకునే వారికి 5 లక్షల అందించనున్నామని తెలిపారు. కాంగ్రెస్ రూరల్ అభ్యర్థి భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు.

     ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు, కళాకారులకు పదవులు ఉద్యోగాలు రాలేదన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు పదేళ్లు అవకాశం ఇచ్చారని, రూరల్ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బీన్ హంధన్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ టీఎస్ డబ్ల్యూ సీడీసీ చైర్ పర్సన్ ఆకుల లలిత, కాంగ్రెస్ నాయకులు అరికెల నర్సారెడ్డి, ముప్పగంగారెడ్డి, గడిల రాములు,ధర్పల్లి మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్, బేల్దారి కృష్ణ, మనోహర్ రెడ్డి, సిరికొండ మండల అధ్యక్షుడు రవి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News