త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ

త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ హింట్ ఇచ్చారు.

Update: 2024-10-14 13:36 GMT

దిశ ప్రతినిధి,నిజామాబాద్: త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ హింట్ ఇచ్చారు. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వాయిదా పడుతున్న.. మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని ఆయన అన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన..ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కేవలం 30 వేల ఉద్యోగాలే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలిచ్చిందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ వదలకుండా అమల్లోకి తీసుకొచ్చిందని, మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్.. ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రైతు రుణమాఫీపై మాట్లాడుతున్న బీఆర్‍ఎస్ నాయకులు ఒక్క విషయంపై స్పష్టత ఇవ్వాలని మహేశ్‌ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ ఎంత? కాంగ్రెస్ తొమ్మిది నెలల్లో చేసిన రుణమాఫీ ఎంతో ఒక్కసారి లెక్కచూస్తే బీఆర్‍ఎస్ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాలన్నారు. దీనిపై తాను గతంలోనూ బీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నించానని, మరెందుకు లెక్కలు చెప్పడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతున్న తీరును చూసి బీఆర్ఎస్ నాయడుకు వణికిపోతున్నారని ఆరోపించారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే యూపీయే ప్రభుత్వం తెలంగాణను ఇచ్చిందని మహేశ్‍ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. పదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి.. రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసి ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసిన కేసీఆర్ కుటుంబం తమ ఆస్తులను మాత్రం భారీగా పెంచుకుందని మహేశ్ ఆరోపించారు. సోషల్ మీడియాను సెన్సు లేకుండా వాడుతున్నారని బీఆర్ఎస్ పై మహేశ్ మండి పడ్డారు. సోషల్ మీడియాలో పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది బీఆర్ఎస్ కు తాత్కాలికంగా ఆనందం కలిగించినా ఆ పార్టీకి దీర్ఘకాలికంగా తీరని నష్టం కలిగిస్తుందన్నారు.

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎంతో చర్చిస్తా..

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై తాను త్వరలోనే సీఎంతో చర్చిస్తానని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రాణహిత 20, 21 వ ప్యాకేజీ పనులు వేగవంతం చేయిస్తామన్నారు. జిల్లాకు అదనంగా ఇంకో మెడికల్ కళాశాల ఆవశ్యకత ఉందని దీనిపై ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. దసరా కానుకగా జిల్లాకు త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు కానుందన్నారు. జిల్లాలో మంచి స్టేడియం నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు మహేశ్ కుమార్ అన్నారు. ఆర్ ఓ బీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని మహేశ్ అన్నారు. నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ రావల్సిన అవసరం ఉందని ఎంపీ అర్వింద్ ఆ దిశగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎంఎల్ఏ డాక్టర్ భూపతిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరాల రత్నాకర్ , పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నుడా చైర్మన్ కేశ వేణు, ఆర్మూర్ ఇన్చార్జి వినయ్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్,జిల్లా ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు వేణు రాజ్, ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,పీసీసీ మాజీ కార్యదర్శి రం భూపాల్,సేవాదళ్ సంతోష్,ఓబీసీ నరేందర్ గౌడ్,బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేటర్ రోహిత్,అడ్వకేట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు


Similar News