బీర్కూర్ చెక్ డ్యాం శంకుస్థాపన కు ఏడాది.. ఇంకా పూర్తి కాని పనులు

Update: 2022-01-29 13:34 GMT

దిశ, బాన్సువాడ: మాటలు కోటలు దాటుతున్న.. చేతలు గడప దాటడం లేదు అన్నట్టు..ప్రభుత్వ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆశయం గొప్పదైన.. ఆలోచన పెద్దగా ఉన్న.. పనుల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేలా ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలే బాన్సువాడ డివిజన్ లో జరుగుతున్న చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేలా చెక్ డ్యాంల నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో 6 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయి. బాన్సువాడ డివిజన్ పరిధిలో సుంకిని, బీర్కూర్, కొడి చర్ల, చింతల్ నాగారం ప్రాంతాల్లో జుక్కల్ డివిజన్ లో బండ రెంజల్, గుండె నెమ్లి ప్రాంతాల్లో మంజూరు అయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి చెక్ డ్యామ్ లు మంజూరు చేయగా, గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం తో సభాపతి ఆశయానికి తూట్లు పడుతున్నాయి.

బీర్కూర్ శివారులోని మంజీరా నది వద్ద 2021 జనవరి 28న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి రూ.28 కోట్ల నిధులు కేటాయించారు. 2021 సెప్టెంబర్ 28 నాటికి పనులు పూర్తి చేసి, రైతులకు అంకితం చేస్తామని నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులు ప్రకటించారు. ఈ హామీకి ఏడాది కావస్తున్నా, పనులు పునాదులకే పరిమితం అయ్యాయి. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కరువైంది.

ఇసుక దందాతో..

ప్రస్తుతం మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ళ కోసమే చెక్ డ్యాంల నిర్మాణం ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటేటా ఇసుక తోడటం తో భూగర్భ జలాలు పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అందువల్ల చెక్ డ్యాంల నిర్మాణం వేగంగా చేయాలని కోరుతున్నారు. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిగతా ప్రాంతాల్లో సైతం

బీర్కూర్ చెక్ డ్యాం పునాది కే పరిమితం కాగా కోడిచెర్ల, సుంకిని, చింతల్ నాగారం, బండ రెంజల్, గుండె నెమ్లి ప్రాంతాల్లో 10 నుంచి 20 శాతం పనులు జరిగాయి. ఎక్కడ కూడా 20 శాతం మించి పనులు జరగకపోవడం నిర్మాణాల్లో నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఇసుక కాంట్రాక్టర్ల కోసమే ఈ జాప్యమని ప్రజలు మండిపడుతున్నారు. సాక్షాత్తు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన చెక్ డ్యాంల పరిస్థితే ఇలా ఉంటే, భవిష్యత్తులో ఇతర నిర్మాణాల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు మొద్దు నిద్ర వీడి, పనుల్లో వేగం పెంచాలని కోరుతున్నారు.

Tags:    

Similar News