‘స్థానిక’ ఎన్నికల్లో పెరగనున్న బీసీ రిజర్వేషన్లు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం పెరగనున్నాయి.

Update: 2024-10-12 02:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం పెరగనున్నాయి. బీసీ గణన పూర్తయిన తర్వాతనే ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీ గణన చేపడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడానికి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి గురువారం స్పష్టం చేశారు. స్టేట్ బీసీ కమిషన్ సైతం ఆ సన్నాహాల్లో ఉందని, దసరా పండుగ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ మొదలవుతుందన్నారు.

బీసీలకు రిజర్వేషన్లు కూడా పెంచుతామన్నారు. బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు రాజకీయ అవకాశాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన తగినన్ని రిజర్వేషన్లు దక్కడం లేదనే అసంతృప్తితో బీసీ వర్గాలున్నాయి. రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని, సరైన రాజకీయ అవకాశాలు కూడా దక్కకుండా బీసీలు అన్యాయానికి గురవుతున్నామనే భావన బీసీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో బీసీల రిజర్వేషన్లు మెరుగయ్యేందుకు మార్గం సుగమమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దసరాకు ముందే తీపి కబురు..

ఒక రకంగా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం దసరాకు ముందే తీపి కబురు అందిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత పదేళ్లలో ఏనాడూ బీసీల గురించి ఆలోచించని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల్లో అడ్డగోలు రిజర్వేషన్లు కేటాయించడమే కాకుండా వాటినే కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈసారి కూడా మునుపటి రిజర్వేషన్లే కొనసాగుతాయని ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాత రిజర్వేషన్లు ఉంటాయో.. మారతాయోననే సందిగ్ధం అందరిలో ఉంది. పది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు ఇంతకు ముందున్న పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా? లేదంటే, రిజర్వేషన్లు మారుస్తారా?అనే విషయంపై ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఆశ పడుతున్న ఆశావహులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గతంగా రిజర్వేషన్లు మారుతాయని, కుల గణన జరుగుతుందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయనే అంశం చర్చకు వచ్చిన విషయం బయటికి పొక్కినప్పటికీ, అధికారికంగా ప్రభుత్వ పెద్దలు ఎక్కడ బయట పడలేదు.తాజాగా సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా కులగణన పైన, బీసీల రిజర్వేషన్లపై నా స్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో అన్ని అనుమానాలకు తెరపడింది. ఇంకా కులగణనను 60 రోజుల్లో పూర్తి చేసి, డిసెంబర్ 9 నాటికి రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తామని స్పష్టత నివ్వడంతో ఇక సీఎం చెప్పిన విషయాలు జరిగిపోయినట్లే భావించవచ్చని ఆయన పట్టుదల, పనితీరుపై అవగాహన ఉన్న నాయకులు చెబుతున్నారు. ఈ నెల 4 న నిజామాబాద్ కు వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విషయం పై చూచాయగా కూడా ప్రస్తావించలేదు. కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బీసీ వర్గాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News