Arrest : సైబర్ నేరస్తుడి అరెస్ట్

నిజామాబాద్ జిల్లా పోలీసులు ఓ సైబర్ నేరగాణ్ణి పట్టుకున్నారు. డిచ్పల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని ఇందల్వాయి పోలీసులు

Update: 2024-08-17 11:20 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పోలీసులు ఓ సైబర్ నేరగాణ్ణి పట్టుకున్నారు. డిచ్పల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని ఇందల్వాయి పోలీసులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మండలానికి చెందిన తీకుట్ల మనోజ్ కుమార్ అనే సైబర్ నేరస్తుడిని పట్టుకుని శనివారం రిమాండ్ చేసినట్లు డిచ్పల్లి సీఐ మల్లేష్ తెలిపారు. ఈ కేసు విషయమై శనివారం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. నిందితుడు మనోజ్ తన మొబైల్ ఫోన్ నుండి ప్రజలకు ఫోన్లు చేసి మీ పేరుపై గోల్డ్ లోన్ ఉందని, ఫోన్ పే ద్వారా వడ్డీ డబ్బులు పంపితే లోన్ అకౌంట్ క్లోజ్ చేస్తానని నమ్మించేవాడు. ప్రజలను తన మాటలతో నమ్మించి ఫోన్ పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడని సీఐ తెలిపారు.

ఇందల్వాయి మండలం స్టేషన్ తండాకు చెందిన బదావత్ ఉపేందర్ నాయక్ కు నిందితుడు మనోజ్ ఈ నెల 5 న ఫోన్ చేశాడు. బ్యాంకులో మీ పేరున గోల్డ్ లోన్ పెండింగులో ఉందని, వడ్డీ మాఫీ కావాలంటే రూ. 25 వేలు ఇప్పటికిప్పుడు ఫోన్ పే చేయాలని, గోల్డ్ లోన్ వెంటనే క్లియర్ చేస్తానని నమ్మబలికాడు. ఇది నమ్మిన బాధితుడు ఉపేందర్ కుమార్ వెంటనే రూ. 25 వేలు నిందితుడికి ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు. తరువాత తను మోసపోయానని గ్రహించిన ఉపేందర్ కుమార్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఫోన్ నెంబర్, ఫోన్ పే ఆధారంగా తీకుట్ల మనోజ్ కుమార్ ను గుర్తించి అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు తరలించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లేష్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరస్తులు వాట్సాప్ లో పోలీస్ అధికారుల డిపిని పెట్టుకుని పోలీసులమని చెబుతూ అమాయక ప్రజలకు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. మీ పిల్లలు డ్రగ్స్ కేసులో పట్టు బడ్డారనో, లేదంటే ఇంకేదైనా కేసులో ఇరుక్కున్నారనో చెప్పి సైబర్ నేరగాళ్లు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారని సీఐ అన్నారు. ఇలాంటి అన్నోన్ కాల్స్ కు ఎవరూ రెస్పాండ్ కావద్దని, అలాంటివి నమ్మొద్దని ఆయన అన్నారు. ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించి జరిగిన విషయంపై ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.

ఇప్పటికే డిచ్పల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని ఇందల్వాయి, జక్రాన్ పల్లి మండలాల్లోని కొందరు సైబర్ మోసాలకు గురైనట్లు సీఐ తెలిపారు. మోసపూరితమైన వాట్సప్ కాల్స్ ను అసలే నమ్మొద్దని, ఏమాత్రం అనుమానం కలిగినా సమీపంలోని పోలీసు స్టేషన్లో, లేదంటే డయల్ 100, 1930 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సీఐ మల్లేష్ ప్రజలకు సూచించారు. బ్యాంక్ అధికారులమని చెప్పి ఏటీఎం నెంబర్ కానీ, ఓటీపీ నెంబర్ కానీ అడిగిన ఎవరికి ఇవ్వొద్దని ఆయన సూచించారు. ఫోన్లో వచ్చే లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని ఆయన అన్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి మోసపోవద్దని, అవి కూడా సైబర్ నేరగాళ్లు విసిరే వలలో ఓ భాగమేనని సీఐ అన్నారు.


Similar News