సంపూర్ణ ఆరోగ్య నియోజకవర్గంగా ఆర్మూర్..
ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఆర్మూర్ నియోజకవర్గం వేగంగా అడుగులేస్తోంది.
దిశ, ఆర్మూర్ : ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఆర్మూర్ నియోజకవర్గం వేగంగా అడుగులేస్తోంది. వంద పడకలకు అప్ గ్రేడ్ అయిన ఆర్మూర్ దవాఖాన ద్వారా ఆధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆడిగిందే తడవుగా సీఎం కేసీఆర్ 27 కోట్ల రూపాయలు మంజూరు చేసి నిర్మించిన నూరు పడకల ఆర్మూర్ దవాఖాన ద్వారా ప్రజలకు ఆధునిక వైద్యం బాగా చేరువై నిజామాబాద్ కో, హైదరాబాద్ కో వెళ్లాల్సిన బాధ చాలా వరకు తగ్గింది.
ఇప్పటికే 25వేల మందికి పైగా ఉచిత ప్రసవాలు జరిగి మాతా శిశు సంరక్షణకు కేసీఆర్ కిట్లను కూడా పంపిణీ చేశారు. ఈ ఉచిత ప్రసవాల వల్ల ఒక్కొక్కరికీ 60వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చుతప్పింది. సిజేరియన్ బాధలు తప్పాయి. గతంలో ఏ చిన్న వైద్య పరీక్షలకైనా నిజామాబాద్ కో, హైదరాబాద్ కో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్నిరకాల వైద్య పరీక్షలు ఆర్మూర్ వందపడకల ఆసుపత్రిలోనే నిర్వహించి వెంటనే రిపోర్టులు చేతిలో పెడుతుండడంతో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలసంపూర్ణ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 25 వేల మందికి పైగా బాధితులు పెద్దాసుపత్రులలో వైద్యం చేయించుకోవడానికి వ్యాధి తీవ్రతను బట్టి 20వేల నుంచి రూ. 20 లక్షల వరకూ సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులను అందించి వారిని ఆదుకోవడానికి పెద్ద దిక్కులా నడిచారు.
డయాలసిస్ సెంటర్ తో కుదుటపడిన కిడ్నీ పేషెంట్లు..రోజుకు 20 మందికి డయాలసిస్ సేవలు...
నిజామాబాద్ కో, మరో దూరప్రాంతానికో వెళ్లి డయాలసిస్ చేయించుకోవడానికి నానా అవస్థలు పడుతున్న ఆర్మూర్ ప్రాంత కిడ్నీవ్యాధి బాధితుల కష్టాలు చూసిచలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పట్టుదలతో కృషి చేసి ఆర్మూర్ ఆసుపత్రిలో కోటి రూపాయల వ్యయంతో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయించారు. గత నెల అయిదో తేదీన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించిన ఈ డయాలసిస్ కేంద్రం వల్ల ఆర్మూర్ పట్టణ, గ్రామీణ, నందిపేట్, జక్రాన్ పల్లి, మాక్లూర్, మోర్తాడ్, బాల్కొండ, భీమ్ గల్, జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్ పల్లి మండలాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట కలిగించింది. ఈ సెంటర్ ద్వారా ప్రతీరోజు 20 మందికి డయాలిసిస్ సేవలు అందించేందుకు వీలు కలుగుతుంది.
ఈ సెంటర్ లో ఇప్పటి వరకూ 450 సెషన్స్ పూర్తి చేశారు. రోగుల తాకిడిని బట్టి ఈ డయాలసిస్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలని వైద్య శాఖ భావిస్తోంది. గతంలో పైన పేర్కొన్న ప్రాంతాల కిడ్నీవ్యాధి ఉన్నవారు వారానికి ఒకటి, రెండు దఫాలుగా నిజామాబాద్ నగరానికి వెళ్లి డయాలసిస్ చేయించుకున్నారు. కొందరైతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయల ఆర్థికభారాన్ని మోయలేక కృంగిపోయారు. ఆర్మూర్ ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రం రావడం వల్ల తమ ఇబ్బందులు తొలిగిపోయాయని కుదుటపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 8.30 వరకు నిర్వహిస్తున్న ఈ డయాలసిస్ సెంటర్ లో సిబ్బందిని పెంచి 24 గంటలూ సేవాలందించాలని నిర్ణయించారు. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ డయాలసిస్ సెంటర్ లో కిడ్నీ రోగులంతా ఉచిత సేవలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత భోజనవసతి..
నియోజకవర్గం నలుమూలల నుంచి నిత్యం ఆర్మూర్ ఆసుపత్రికి వైద్య సహాయం కోసం వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన ఆహారం సరఫరా చేయడానికి జీవన్ రెడ్డి అక్కడికి సమీపంలోనే ఉన్న తనక్యాంపు కార్యాలయంలో ఉచిత భోజన వసతిని కలిపించారు. రోగులతో పాటు వారి వెంట వచ్చే వారికి కూడా భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. జీవన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ నిత్య అన్నదాన కార్యక్రమం తప్పకుండా సాగడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని జీవన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నిర్ణయం పట్లఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అభినందిస్తున్నారు.