ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ మృతి..
ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో వెలుగు చూసింది.
దిశ, కనగల్ : ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో వెలుగు చూసింది. కనగల్ ఎస్సై పి.విష్ణు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బోయినపల్లి గ్రామానికి చెందిన కడారి వెంకటేశం (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పగిల్ల యాదయ్యకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్ ట్రాలీ పై ఆన్‌లైన్ ఇసుక రవాణా చేస్తుండేవాడు.
సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో, వెంకటేశం ఇసుకను లోడ్ చేసుకొని అన్లోడ్ చేయడానికి వెళ్తుండగా బుడమర్లపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ డీజిల్ అయిపోవడంతో దానిని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు. ఈ సమయంలో ట్రాలీ వెనుక డోర్ ఊడిపోవడంతో అదే ప్రాంతంలో ఉన్న మరో డ్రైవర్ కారింగు లింగస్వామి సహాయంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే అనుకోకుండా ట్రాక్టర్ ముందుకు కదలడంతో ట్రాక్టర్ ఇంజన్ ఆపేందుకు వెంకటేశం స్టీరింగ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు కానీ బ్యాటరీ పై కాలు పెట్టిన అతడు ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో ట్రాక్టర్ మధ్య టైరు అతని తల మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో కడారి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు కడారి శివ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి.విష్ణుమూర్తి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.