మంటల్లో మానవ సంబంధాలు.. భారమవుతున్న బంధాలు..
మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి.

మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. ఆస్తి కోసం రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కక్షలు పెంచుకుని అయిన వారిని హతమారుస్తున్నారు. ఒకప్పుడు కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే వెంటనే కుటుంబ సభ్యులు మేమున్నామని భరోసాగా నిలిచే వారు. ఆసరా అయ్యే వారు. రాను రాను ఈ సంబంధాలు కనిపించకుండా పోతున్నాయి. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో ఆస్తుల కోసం అయిన వారిని, రక్త సంబంధీకులనే పొట్టనబెట్టుకుని, సహజ మరణాలుగా, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. చేసిన నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు దొరికిపోయి కటకటాల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జిల్లాలో అలాంటి ఘటనలు నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు జరిగాయి. ఓ కూతురు తన భర్తతో కలిసి కన్న తల్లినే కడతేర్చింది.. సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి తల్లి పై పడి రోధిస్తూ డ్రామా క్రియేట్ చేసింది. మరో ఘటనలో కొడుకు తన భార్యతో కలిసి తండ్రిని మట్టుపెట్టాడు. ఈ రెండు ఘటనల్లో నిందితులు జైళ్లో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తల్లిదండ్రులు కనిపించే దైవాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అందరూ చెపుతారు.. చాలా మంది ఈ ధర్మాన్ని పాటిస్తారు కూడా. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు.. అంతస్థులు కూలిపోతే మళ్లీ నిర్మించుకోవచ్చు. కానీ, అయిన వాళ్లు దూరమైతే.. అమ్మా, నాన్నలు చనిపోతే.. మళ్లీ తెచ్చుకోలేం.. వాళ్లు లేని లోటును దేనితోనూ పూడ్చుకోలేం.. కానీ, ఆధునిక యుగంలో జనం బంధాల కన్నా డబ్బుల కట్టలకు, ఆస్తులకే విలువిస్తున్నారు. కళ్ల ముందు కష్టాల్లో ఉన్న తన వాళ్లను పట్టించుకోవడం లేదు కానీ, వారి వెనకాల ఆస్తిని కాజేసేందుకు వేయాల్సిన ప్లాన్స్ వేస్తున్నారు. ఆస్తులు కొట్టేస్తున్నారు. అవసరమైతే మనీ కోసం మనుషులనే లేపేస్తున్నారు.
నాగారంలో తల్లిని చంపిన కూతురు..
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో నివాసం ఉంటున్నవిజయ అనే వృద్ధురాలిని కూతురు సౌందర్య ఆమె భర్తతో కలిసి కన్న తల్లినే హత్య చేసింది. అనవరసర ఖర్చులు తగ్గించుకోవాలని, డబ్బులు పొదుపుగా ఖర్చు చేయాలని కూతురు బాగు కోసం ఆ తల్లి మంచి మాటలు చెప్పడమే పాపమైంది. అదే ఆ వృద్ధురాలికి శాపమైంది. తల్లి చెప్పిన మాటలు కూతురు సౌందర్యకు రుచించకపోవడంతో కన్న తల్లిని కడతేర్చాలనుకుంది. తన ప్లాన్ ను తన భర్తకు వివరించింది. ఇంకేముంది ఆయన కూడా సరేనన్నాడు. ఇక అంతే అనుకున్న రోజే రాత్రి సుమారు 11, 12 గంటల మధ్య విజయను అంతమొందించారు. విజయ గాఢ నిద్రలో ఉండగా సౌందర్య ముఖం పై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసింది. సౌందర్య భర్త విజయను కదలకుండా కాళ్లు, చేతులను గట్టిగా పట్టుకున్నాడు.
విజయ ప్రాణం పోయిందోలేదోననే అనుమానంతో గొంతు నులిమేసి మరీ చంపింది. తల్లి మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పిందని డాక్టర్ దగ్గరికి తీసుకెళదామనుకునేలోగానే చనిపోయిందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశారు. స్థానికులు కూడా మొదట నిజమేనని నమ్మినప్పటికీ వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో మృతదేహాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. గొంతు పై కమిలిపోయినట్లుగా కనిపించడంతో ఇద్దరినీ గట్టిగా నిలదీశారు. వారు భయంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గట్టిగా చితకబాదారు. దీంతో అసలు విషయం బయటికి కక్కారు. విజయను తామే చంపామని మృతురాలి కూతురు సౌందర్య, ఆమె భర్త నేరాన్ని అంగీకరించారు. ఏ పనీ చేయని అల్లుడిని, కూతురును వారి కుటుంబాన్ని విజయమ్మనే పోషిస్తోందని తెలిసింది.
హాన్నాజీ పేటలో తండ్రిని హతమార్చిన తనయుడు..
మరో ఘటనలో సిరికొండ మండలం హొన్నాజీపేట్ గ్రామంలో ఓ కొడుకు తన భార్యతో కలిసి తండ్రిని బీరుసీసాతో తలపై మోది చంపాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే జిల్లాలో రెండు ఘటనలు జరగడం గమనార్హం. హొన్నాజీపేటలో గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న పాలెపు నడిపి మల్లయ్య (65)కి తన కొడుకు మధుతో కొద్ది రోజులుగా ఇంట్లో డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా గ్రామంలోని ఓ దుకాణం ఎదుట తండ్రీ కొడుకుల మధ్య డబ్బుల విషయంలోనే తీవ్ర వాగ్వాదం జరగడంతో స్థానికులు సముదాయించి ఇద్దరినీ ఇంటికి పంపించేశారు. ఇంటికొచ్చాక తండ్రితో జరిగిన గొడవ గురించి మధు తన భార్య లక్ష్మితో చెప్పాడు. దీంతో లక్ష్మి కూడా మామతో గొడవకు దిగింది. మాటా మాటా పెరగడంతో తల్లీ కొడుకులిద్దరూ కలిసి లింగయ్యను కింద పడేశారు. అనంతరం ఆవేశంతో మధు ఖాళీ బీరుసీసాతో తండ్రి తల పై గట్టిగా కొట్టడంతో తండ్రి మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు భార్యాభర్తలు మధు, లక్ష్మీలపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన కొద్ది నెలల్లో రెండు మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి.
బంధాల కన్నా డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్న కొందరు డబ్బే ప్రధానం అనుకునే వ్యక్తులు డబ్బుల కోసం అవసరమైతే ఎందాకైనా ముందుకెళ్లాలనే ఆలోచనతో బతుకులు ఛిద్రం చేసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆస్తి మీద వ్యామోహంతోనో మనుషులను చంపుతూ వెళ్తే భవిష్యత్తులో ఏం సాధిస్తారని ఇలాంటి వారిని అడిగితే పశ్చాత్తం తప్ప మరేదీ ఉండదు. సమాజం ఇలాంటి నేరగాళ్ల పట్ల జాలిని కూడా చూపకపోవడం గమనార్హం.