కలెక్టరేట్ ను ముట్టడించిన అంగన్వాడీలు
అంగన్ వాడీ ఉద్యోగులు నిజామాబాద్ కలెక్టరేట్ మంగళవారం కూడా ముట్టడించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 18: అంగన్ వాడీ ఉద్యోగులు నిజామాబాద్ కలెక్టరేట్ మంగళవారం కూడా ముట్టడించారు. రెండో రోజు కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా పెద్దయెత్తున అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు కలెక్టరేట్ కు చేరుకుని ప్రధాన గేట్ల వద్ద బైఠాయించారు. కలెక్టరేట్ లోని ఉద్యోగులెవరూ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేట్లకు అడ్డంగా కూర్చొని పెద్ద యెత్తున నినాదాలు చేశారు. అంగన్ వాడీల ఆందోళనను నిలువరించేందుకు కలెక్టరేట్ వద్దకు చేరుకున్న పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలతో అక్కడి నుంచి వెళ్లి పోవాలని కోరారు. దీంతో పోలీసులకు, అంగన్ వాడీ కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.
శాంతియుతంగా తమ నిరసనను తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను, సిఐటియు నాయకులను పోలీస్ అధికారులు తమ సిబ్బందిని పురమాయించి బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుండి బలవంతంగా తరిలించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా నూర్జహాన్, రమేశ్ బాబులు మాట్లాడుతూ.. అంగన్ వాడీ సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు.
అనేక మార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకున్నప్పటికీ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. 15 నెలల ఓపిక అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు శాంతియుత నిరసనకు బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా ప్రభుత్వం నిర్దిష్ట హామీని ఇవ్వాలని ఆందోళనకు నిర్ణయించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, జిల్లా నాయకులు మంగాదేవి, శివరాజమ్మ, జ్యోతి, గోదావరి, జగదాంబ, సందీప, సవిత, సునీత సిఐటియు నాయకులు ఈవీఎల్ నారాయణ, మోహన్, వేషాల గంగాధర్ తదితరులతోపాటు వందలాది మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.