ఒకే దేశం, ఒకే ఎన్నిక దృక్కోణ కార్యక్రమం
బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన మంగళవారం ఒకే దేశం, ఒకే ఎన్నిక బీజేపీ దృక్కోణంపై బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కార్యశాల (వర్క్ షాప్) నిర్వహించారు.

దిశ, కామారెడ్డి టౌన్ :బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన మంగళవారం ఒకే దేశం, ఒకే ఎన్నిక బీజేపీ దృక్కోణంపై బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కార్యశాల (వర్క్ షాప్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్ర, ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉండటం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఆర్థికంగా కూడా చాల భారం కలుగుతుందని, రాజకీయంగా కూడా అనిశ్చితి ఏర్పడుతుందన్నారు. అందుకే నరేంద్ర మోది దూర దృష్టితో జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ఛైర్మెన్ గా, హోమ్ మంత్రి అమిత్ షా, గులాం నబీ ఆజాద్, కశ్యప్ ఇలా అన్ని వర్గాల వ్యక్తులతో కమిటీ వేయటం జరిగిందని అన్నారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఒకే సారి రాష్ట్ర, కేంద్ర ఎన్నికలు నిర్వహించి మూడు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తర్వాత నాలుగున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు లేకుండా కేవలం పాలన పై దృష్టి కేంద్రీకరించవచ్చు అని పేర్కొన్నారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కావాలనే రాద్దాంతం చేసి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంపొందించాలని చూస్తున్నాయన్నారు. కావున ఈ అంశంపై బీజేపీ దృక్కోణాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కార్యశాలలు నిర్వహించి కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, కార్యక్రమం కన్వీనర్ లింగరావు, నాయకులు వేణు, శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, భరత్, నరేందర్, రమేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.