ఇంకెన్నాళ్లు అంబులెన్స్లో కాన్పులు

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది ఆ ఆసుపత్రి పరిస్థితి...

Update: 2024-03-13 11:40 GMT

దిశ, గాంధారి : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది ఆ ఆసుపత్రి పరిస్థితి... పేరు మాత్రం డీఎంహెచ్వో పరిధి నుండి డీసీహెచ్ ఎస్ గా మారిందని ప్రజలు చెప్పుకోవడం తప్ప ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. దాంతో నడిరోడ్డు మీద అంబులెన్స్ లోనే కాన్పులు అవుతున్న దుర్భర పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి పీహెచ్సీ ఉన్నప్పటి నుండి ఐదు సంవత్సరాలు అవుతున్నా గైనకాలజిస్ట్ అందుబాటులో లేరు. ప్రభుత్వ ఆదేశాలనుసారం

     పీహెచ్ సీ దావకాన కాస్త డీసీహెచ్ఎస్ పరిధిలోకి వెళ్లి ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టినా గైనకాలజిస్ట్ మాత్రం వచ్చిన దాఖలాలు లేవు. గైనకాలజిస్ట్ పోస్టు ఇప్పటికీ ఖాళీగానే ఉండిపోవడంతో ఇక్కడ గైనకాలజిస్ట్ చూడాల్సిన కేసులన్నీ రెఫర్ గా బాన్సువాడ హాస్పిటల్ కు, కామారెడ్డి హాస్పిటల్ లకు పంపుతున్నారు. దీంతో 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో పురిటి నొప్పులు వచ్చిన వారు అంబులెన్స్ లోనే ప్రసవించాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది.

పేరుకేనా మేజర్ గ్రామపంచాయతీ.....

ఎల్లారెడ్డిలో అత్యధిక జీపీలు ఉన్న మండలంలో మేజర్ గా గాంధారి ఒకటి. ఇక్కడ దాదాపు 44 గ్రామపంచాయతీల పరిధిలోని చిన్నచిన్న గ్రామాలకు అంబులెన్స్ సేవలు అందించాల్సి వస్తుంది. 44 గ్రామపంచాయతీల పరిధిలోని వివిధ తండాలకు, జీపీలకు మండలంలో ఒక్క అంబులెన్స్ ఏ మాత్రం సరిపోవడం లేదు. అంతేకాకుండా అటు గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్లకు, చిన్నచితక జబ్బులకు కూడా అందరూ అంబులెన్స్ కు ఫోన్ చేయగా వారికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉన్నది మండలానికి ఒకటే అంబులెన్స్ ఉంది.

108 సిబ్బంది వెళ్లేలోపు ప్రసవం....

ఒక్కోసారి అంబులెన్స్ సిబ్బంది పురిటి నొప్పులతో బాధపడుతున్న వారి స్థలానికి చేరుకునే లోపే ఇంట్లోనే డెలివరీ అవుతున్నారు. మరి కొందరికి ఇంటి వద్దనే 108 సిబ్బంది ప్రసవం చేసిన సంఘటన కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గైనకాలజిస్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చి ఇలా నడిరోడ్డు పైన అంబులెన్స్ లో కాన్పులు కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

గైనకాలజిస్ట్ ఎవరూ రావడం లేదు : ఇన్ఛార్జి డాక్టర్ ప్రవీణ్

పీఎస్సీ నుంచి డీసీహెచ్ ఎస్ గా మారినా ఇప్పటివరకు ఐదు సంవత్సరాలుగా గైనకాలజిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉందని ఇన్చార్జి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.  


Similar News