నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. వ్యూహ, ప్రతివ్యూహాల్లో భారీ మార్పులు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జాతీయ పార్టీలు తెలంగాణ టార్గెట్‌గా వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జాతీయ పార్టీలు తెలంగాణ టార్గెట్‌గా వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతున్నాయి. అక్కడ గెలిచే పార్టీ ప్రభావం ఇక్కడ కనిపించే చాన్స్ ఉన్నది. మరి అక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీనా? లేక బీజేపీనా? హంగ్ వస్తే జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏమైనా ఉంటుందా? అనేది ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది. మే 13న వెలువడే ఫలితాల తర్వాత తెలంగాణలో పార్టీ వ్యూహ, ప్రతివ్యూహాల్లో భారీ మార్పులు ఉండనున్నట్టు తెలుస్తున్నది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు పోటీ చేస్తున్నా ప్రధాన పోటీ మాత్రం తొలి రెండు పార్టీల మధ్యే ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రీ-పోల్ సర్వే అంచనాలన్నీ కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని తేల్చేశాయి. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న లింగాయత్ ఓట్లు రెండు పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపనున్నది. బీజేపీకి అనుకూలంగా ఉండే లింగాయత్ ఓటు బ్యాంకు ఈసారి కాంగ్రెస్‌వైపు మళ్లడం ఊహించని పరిణామం. బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, మోడీ, అమిత్ షా తదితరులంతా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ తరఫున సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకా, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలంతా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో తిరుగుతూ తెలుగులోనే ప్రసంగించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏ జాతీయ పార్టీ గెలిచినా ఇక్కడ ప్రభావం !
కర్ణాటకలో గెలుపు తథ్యమని, వచ్చేది తమ ప్రభుత్వమేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. పొత్తుల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగానే ఉంటుందని, విజయానికి చేరువ చేస్తుందన్నది పీసీసీ నేతల భావన. బీజేపీ గెలిస్తే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్ని మరింత అనుకూలంగా మారుస్తుందని కమలనాథుల అంచనా.
బీఆర్ఎస్ ఫోకస్
కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాకుండా బీఆర్ఎస్ సైతం కర్ణాటక రిజల్టుపై సీరియస్‌గానే ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగానే యాంటీ-బీజేపీ, యాంటీ-కాంగ్రెస్ ఫైట్‌పై తగిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నది. అక్కడ ఏ పార్టీ గెలిచినా దాని ఎఫెక్ట్ ఇక్కడ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటి నుంచే సమాలోచనలు చేస్తున్నది. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న పరిస్థితుల్ని మరింత అనుకూలంగా మారుస్తుందని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకన్నా ఎక్కువ సీట్లు సాధించుకోడానికి అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో గెలిస్తే కాంగ్రెస్‌కు నైతికంగా బూస్ట్ ఇస్తుందని, ఆర్థికంగానూ ఆ రాష్ట్రం నుంచి భరోసా లభిస్తుందన్న భావనతో ఉన్నారు.
అధికార పార్టీలో ఆందోళన
ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావడానికి ఆ పార్టీ ప్రయత్నించే అవకాశముందని బీఆర్ఎస్ భావిస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (2018లో) కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెల్చుకోవడం బీఆర్ఎస్‌ను అప్పట్లో డైలమాకు గురిచేసింది. కర్ణాటక విజయాన్ని భూతద్దంలో చూపి తెలంగాణలో రకరకాల ఎత్తులకు పాల్పడుతుందని భావిస్తున్నది. గులాబీ నేతలను మానసికంగా కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. యాంటీ-బీజేపీ ఫైట్‌ను తీవ్రం చేయడంలో పరిమితులు ఏర్పడొచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. సొంతంగా బీజేపీకి తెలంగాణలో పవర్‌లోకి వచ్చేంత శక్తి లేనప్పటికీ గులాబీ లీడర్లను డిస్టర్బ్ చేస్తుందనే అనుమానం వ్యక్తమవుతున్నది.
ప్రధాన పోటీ వీటి మధ్యే..
తెలంగాణలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌తోనే ఎక్కువ చిక్కులు ఉంటాయన్నది గులాబీ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత అభిప్రాయం. కాంగ్రెస్ ఎఫెక్టు తగ్గించేలా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ మరో రూపం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రధాన పోటీ తమ రెండు పార్టీల మధ్యనే అనే భావన ఏర్పడేలా వ్యూహం తెరపైకి వచ్చే చాన్స్ ఉన్నది. యాంటీ-బీజేపీ ఫైట్‌ను మరింత తీవ్రం చేసి ప్రధాన పోటీ ఆ పార్టీతోనే అనే మెసేజ్ జనంలోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ఖరారయ్యే అవకాశాలున్నాయి.
నేషనల్ పార్టీల నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ
కర్ణాటకలోని రిజల్టు తర్వాత రెండు జాతీయ పార్టీలు తెలంగాణపైనే ఫోకస్ పెట్టనున్నాయి. కర్ణాటకలోని విజయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతనే ప్రధానంగా ప్రచారం చేసుకోనున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, జాబ్ నోటిఫికేషన్లు, ఉపాధ్యాయుల్లో బదిలీల వివాదం, ఉద్యోగుల వేతన సమస్య.. ఇలాంటివన్నీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాయి. తొమ్మిదేళ్లుగా గులాబీ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దీటుగా కొత్త హామీలతో జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో ఉచిత విద్య-వైద్యం, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, రైతుబంధు సాయాన్ని పెంచడం, పంటలకు ఎమ్మెస్పీ భరోసా.. ఇలాంటి వాటిని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా డిక్లరేషన్‌లనే ప్రకటించింది. మేనిఫెస్టోల్లోనూ వీటిని ఆ రెండు పార్టీలు చేర్చే అవకాశాలున్నాయి.