NVSS Prabhakar: ప్రతిసారి బొట్టు పెట్టి పిలవాలా? ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం
దీపాదాస్ మున్షీ వర్సెస్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యవహారంలో నాంపల్లి కోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నాయకుడిపై తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి దీపా దాస్ మున్షీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు దీపాదాస్ మున్షీ హాజరుకాగా ప్రభాకర్ గైర్హాజరయ్యారు. దీంతో ప్రభాకర్ గైర్హాజరుపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారి బొట్టు పెట్టి పిలవాలా? సమన్లు ఇచ్చాక కూడా కోర్టుకు రారా? అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కోర్టుకు హాజరు కాకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవనంటూ హెచ్చరిస్తూ న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు.
కాగా లోక్ సభ ఎన్నికల సందర్భంగా దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారు, డబ్బులు తీసుకుని ఎంపీ టికెట్లు వచ్చేలా చేశారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఆరోపణలు చేశారు. పార్టీలో తన పదవిని అడ్డుపెట్టుకుని దీపాదాస్ మున్షీ క్విడ్ ప్రోకో కు పాల్పడినట్లు ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను అప్పుడే ఖండించిన దీపాదాస్.. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని పేర్కొంటూ నాంపల్లి కోర్టులో రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో గతంలోనే కోర్టు దీపాదాస్ వాంగ్మూలాన్ని సైతం రికార్డు చేసింది.