పారిపోదాం అనుకున్నారు.. అడ్డంగా బుక్కయ్యారు..

ఇళ్ళ ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను అపహరించే ఇద్దరు దొంగలను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు శనివారం పట్టుకున్నారు.

Update: 2023-07-01 09:58 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్ : ఇళ్ళ ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను అపహరించే ఇద్దరు దొంగలను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 బైకులను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. చౌటుప్పల్ ఏసీపీ వై.మొగిలయ్య తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన సంపంగి శివ (21) అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ముగ్ధముల సింహాద్రి (20) అనే ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. కుటుంబ అవసరాలకు, తాగుడుకు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ద్విచక్ర వాహనాలను అపహరించి సునాయాసంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

సంపంగి శివ అనే యువకుడు తనకు తానుగా హయత్ నగర్, ఎల్బీనగర్, చౌటుప్పల్, సూర్యాపేట జిల్లా చివ్వెంల ప్రాంతాల్లో 8 బైకులు చోరీ చేయగా... ముగ్ధముల సింహాద్రి తో కలిసి చౌటుప్పల్, హయత్ నగర్ ప్రాంతాలలో రెండు బైకులను దొంగిలించారు. ఇలా అపహరించిన పది బైకులను సంపంగి శివ ఇంట్లో దాచి పెట్టారు. శనివారం ఉదయం చోరీ చేసిన బైకులను ఇతరులకు విక్రయించేందుకు బయలుదేరిన ఇద్దరు దొంగలు చౌటుప్పల్ లోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కారు. పోలీసులకు తమ వెంట ఉన్న ద్విచక్ర వాహనాల పత్రాలను చూపించకుండా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వీరిని వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చి విచారించడంతో మొత్తం పది బైకులు చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు. సంపంగి శివ ఇంట్లో దాచిపెట్టిన సదరు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.

పోలీసు బృందానికి రివార్డులు : ఇటీవల కాలంలో తరచుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బైకు దొంగతనాలు పెరిగిపోతుండడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ లో వాహనాల తనిఖీ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. చౌటుప్పల్ ఏసీపీ వై.మొగిలయ్య పర్యవేక్షణలో ఈ బృందం చురుకుగా పనిచేస్తున్నారు. చౌటుప్పల్ లో నెంబర్ ప్లేట్లు లేకుండా నడిపే ద్విచక్ర వాహనాలను.. అనుమానాస్పద రీతిలో బైకుల పై తిరిగే వారిని ఆపి తనిఖీలు చేస్తున్నారు. శనివారం సైతం ఇదేవిధంగా తనిఖీలు చేస్తుండగా ఈ ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కారు. చాకచక్యంగా బైకు దొంగలను పట్టుకున్న స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్. దేవేందర్, ఎస్సై కె.యాదగిరి, కానిస్టేబుళ్లు శోభన్ బాబు, వై.కిష్టయ్య, పి.శ్రీను, హోంగార్డు ఊడుగు సైదులును ఈ సందర్భంగా ఏసీపీ అభినందించారు. ఈ పోలీస్ బృందానికి ప్రత్యేక రివార్డులు సైతం ప్రకటించారు.

Tags:    

Similar News