నిర్వీర్యం అవుతున్న సమాచార హక్కు చట్టం

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారం సమాచార హక్కు (Right to Information).

Update: 2024-08-21 06:16 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారం సమాచార హక్కు (Right to Information). సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్లిన పనిచేయించుకోవడం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) భారతదేశమంతటా అమలులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమాచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంట్, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డు మీద స్పష్టంగా రాసి ఉంచాలి.

సామాన్య ప్రజలకు సాధికారత కల్పించేందుకు తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాల్లో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)-2005 కూడా ఒకటి. తమ హక్కులను కాపాడుకునేందుకు చాలా మంది అణగారిన వర్గాల ప్రజలు దీన్ని ఆశ్రయిస్తున్నారు.''అవినీతి, అవకతవకలను ఈ చట్టం వెలుగులోకి తీసుకొచ్చి,అధికారంలో ఉన్న వారిని జవాబుదారీతనానికి బాధ్యులను చేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. కాని సూర్యాపేట జిల్లాలో సమాచార హక్కు చట్టంను మండల స్థాయి అధికారుల నుంచి, జిల్లా అధికారులు, నీరుగారుస్తున్నారని, దరఖాస్తు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా దరఖాస్తు దారులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని దరఖాస్తు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అడిగిన దరఖాస్తు దారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైన కలెక్టర్ జిల్లాలో సమాచార హక్కు చట్టంను నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకుని దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందించాలని ఆర్‌టీఐ దరఖాస్తుదారులు కోరుకుంటున్నారు.


Similar News