BRS: మూసీ పునరుజ్జీవానికి మేం సహకరిస్తాం.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రకటన
మూసీ పునరుజ్జీవాని(Musi Cleansing)కి తాము నూటికి నూరుశాతం సహకరిస్తాం, స్వాగతిస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవాని(Musi Cleansing)కి తాము నూటికి నూరుశాతం సహకరిస్తాం, స్వాగతిస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునిత(Gongidi Sunitha), చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah), పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) మీడియాతో మాట్లాడారు. మూసీ నీటి శుద్ధిని ప్రారంభించిందే బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. మూసీ ద్వారా ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాదిగానీ కాలువతో ఉమ్మడి జిల్లాకు నీరు వస్తాయన్నారు. వీటి నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 284 కోట్ల 85 లక్షలు మంజూరు చేసిందన్నారు. మూసీని శుద్ధి చేస్తే స్వాగతిస్తాం.. చేసేది చిత్తశుద్ధితో చేయండి అని ప్రభుత్వానికి సూచించారు. ప్రణాళికాబద్ధంగా చేయాలన్నారు. లక్షా 50 వేల కోట్లు అన్నందుకు అనుమానాలు వస్తున్నాయని, అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ చేసిన 31 ఎస్టీపీలలో కొన్ని నీటిని శుద్ధి చేస్తున్నాయని, మిగిలిన వాటిని వినియోగంలోకి తీసుకురాలని సూచించారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందజేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌తో ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తుందని ఆరోపించారు. మూసీలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరదలు వచ్చినా సమీప ఇళ్లలోకి నీరు రాదని, ప్రజలకు ఆస్తినష్టం జరుగదన్నారు. మూసీని16వేల కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 25 వేల కోట్లు సరిపోతదన్నారు. కానీ లక్షా 50 వేల కోట్లు అంటే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. జిల్లాను అభివృద్ధి చేస్తే పూర్తి సహకారం అందజేస్తామన్నారు. డ్రామాలు ఆడుతూ చైతన్యయాత్రలు కాదు.. పనులు ప్రారంభించండి.. తాము కలిసి వస్తామని స్పష్టం చేశారు.