Seethakka : రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు తిప్పికొట్టాలి : సీతక్క
భారత రాజ్యాంగాన్ని(Constitution) కొన్ని శక్తులు నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారతీయులంతా అడ్డుకుని తిప్పికొట్టి తీరాలని..రాజ్యాంగం లేకపోతే అందరికీ అన్యాయం జరుగుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)అన్నారు.
దిశ, వెబ్ డెస్క్ : భారత రాజ్యాంగాన్ని(Constitution) కొన్ని శక్తులు నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారతీయులంతా అడ్డుకుని తిప్పికొట్టి తీరాలని..రాజ్యాంగం లేకపోతే అందరికీ అన్యాయం జరుగుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మారడానికి ప్రధాన కారణం డా. బిఆర్ అంబేద్కర్, ఆయన రచించిన భారత రాజ్యాంగమని, రాజ్యాంగాన్ని, స్పూర్తిని మనందరం కాపాడుకోవాలన్నారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరేలా ప్రచారం జరగాలని సూచించారు.
కుల మతంతో సంబంధం లేకుండా అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛను, అందరికి హక్కులను కల్పించింది మన రాజ్యంగమని కొనియాడారు. అందుకే రాజ్యాంగ గొప్పతనాన్ని అందరం కాపాడుకోవాలని, రాజ్యంగ ఫలాలు ప్రతి గడపకు చేరేలా ప్రచారం చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అని, తాను అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు భవిష్యత్ తరాలకు రావోద్దన్న సంకల్పంతో అందరికీ హక్కులు కల్పించిన మహనీయుడని శ్లాఘించారు. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లతో పాటు, అన్ని వర్గాలకు హక్కులు కల్పించింది మన రాజ్యంగమని, 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న రాజ్యాంగం పరిరక్షణకు అంతా ప్రతిన పూనాలని కోరారు.