TDPP : పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ప్రారంభం
నూతన పార్లమెంటు (Parliament) భవనంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ(TDPP) కార్యాలయాన్ని టీడీపీ ఎంపీలు ప్రారంభించారు.
దిశ, వెబ్ డెస్క్ : నూతన పార్లమెంటు (Parliament) భవనంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ(TDPP) కార్యాలయాన్ని టీడీపీ ఎంపీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటరీ పార్టీ విప్ గంటి హరీష్ మాధూర్, ఎంపీలు పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా తెలుగు దేశం పార్టీకి నూతన పార్లమెంటులో నూతన కార్యాలయం కేటాయించారు. నూతన పార్లమెంటు మొదటి అంతస్తులోని ఎఫ్09 నుంచి ఇకపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. నూతన పార్లమెంటు మొదటి అంతస్తులో ప్రధాని, కేంద్ర మంత్రుల కార్యాలయాలు కూడా ఉన్నాయి.
గతంలో పాత పార్లమెంటులో (సంవిధాన్ సదన్) టీడీపీపీ కార్యాలయం ఉండేది. కాగా పాత పార్లమెంటు ప్రాంగణంలో ఇప్పటికీ కొనసాగుతున్న కార్యాలయాలలోనే ఇక ముందు కూడా కొనసాగేందుకు పలు పార్టీలు మొగ్గు చూపాయి. దీంతో ఆయా పార్లమెంటరీ పార్టీల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్ సహా పది పార్టీలకు ఆ కార్యాలయాలనే లోక్ సభ సెక్రటేరియట్ కేటాయించింది.