ఆ మేనేజర్ ఓ అక్రమాల పుట్ట...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సూర్యాపేట మేనేజర్ గా పని చేసిన షేక్ సైదులు అక్రమాల పై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాదారులు వేడుకుంటున్నారు.

Update: 2024-07-04 09:13 GMT

దిశ, సూర్యాపేట : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సూర్యాపేట మేనేజర్ గా పని చేసిన షేక్ సైదులు అక్రమాల పై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాదారులు వేడుకుంటున్నారు. గురువారం ఆ బాధితులు "దిశ" తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఉద్యోగ రీత్యా తాము రుణాల మంజూరి కోసం బ్రాంచ్ కి వెళ్తే రుణాలు మీకు కావల్సినంత ఇస్తామని మాయ మాటలు చెప్పి తమ సంతకాలను ఫోర్జరీ చేసి వారి ఖాతాల ద్వారా లక్షల్లో లోన్ లు పొందారని ఆరోపించారు. తమకి తెలియకుండానే తమ జీతాల నుంచి ఈఎంఐ డబ్బులు కట్ అవుతున్నాయని, దీనివల్ల తమ కుటుంబ సభ్యులను పెంచి పోషించలేని పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు.

తమలాగే మోసపోయిన జూబ్లీహిల్స్, రామాంతపూర్, సికింద్రాబాద్ (మహేంద్ర హిల్స్ బ్రాంచ్) బ్రాంచులలోని ఖాతాదారులు కట్టిన ఈఎంఐ సొమ్మును ఎస్బీఐ ఉన్నతాధికారులు తిరిగి చెల్లించారని, అదే రీతిలో తమకు చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని సూర్యాపేట బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. సైదులు అక్రమాల పై తాము మార్చి 11, 2024 న పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆ ఫిర్యాదు పై కోర్టు ఆదేశానుసారం ఈ నెల 5న సూర్యాపేటకి విచారణ నిమిత్తం పోలీసులు తీసుకురానున్నట్లు తమ వద్ద సమచారం ఉందన్నారు. పోలీసులు సమగ్రమైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

మేనేజర్ సైదులు అక్రమాలు బయట పడిన విధానం..

ఎస్బీఐలో మాజీ ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తించిన షేక్ సైదులు తన ఉద్యోగాన్ని మరిచి అడ్డదారిలో వెళ్ళి ఖాతాదారులను బురిడీ కొట్టించాడు. రాష్ట్రంలో అతను పని చేసిన సూర్యాపేట, జూబ్లీహిల్స్, ఉప్పల్, రామంతాపూర్ బ్రాంచ్ లలోని ఖాతాదారులకు తెలియకుండానే సుమారు రూ.30 కోట్ల మేర రుణాల పేరుతో కాజేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయవాడ జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న బ్రాంచ్ లో సుమారుగా 2 సంవత్సరాలకు పైగా మేనేజర్ గా పనిచేశాడు. ఆ బ్యాంకులో రుణాల కోసం వెళ్లిన ఉద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి మీరు అనుకున్నట్లు రుణాలు ఇస్తానని మాయమాటలు చెప్పి వారితో సంతకాలు తీసుకొని అదే బ్రాంచ్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సంతోష్ సహకారంతో ఫారం-16 లో ఫోర్జరీ సంతకాలతో వారి పేరున రుణాలు పొందాడని తెలిపారు. ఆ డబ్బులను వెంటనే ఆయన భార్య సుష్మా, స్నేహితులు పీరయ్య, రాధాకృష్ణల ఖాతాలోకి జమ చేసేవాడని తెలిపారు.

సూర్యాపేట బ్రాంచ్ లో సుమారు 43 మంది పేరున రూ.5 కోట్ల లను కాజేశాడని తెలిపారు. అక్కడి నుంచి బదిలీపై జూబ్లీహిల్స్, ఉప్పల్, రామంతాపూర్ బ్రాంచ్ లలో పనిచేస్తూ వెస్ట్ మారెడ్ పల్లి బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేస్తున్న భగీరథ గంగ మల్లయ్యను జతగా తీసుకొని ఇద్దరు కలిసి సుమారు రూ.2.8 కోట్లు కాజేసినట్లు తెలిపారు. అంతే కాక సైదులు స్వతహాగా 30 మంది పేర్లతో రూ.17 కోట్లు కాజేశాడు. గంగ మల్లయ్య ఇదే తరహాలో స్వతహగా రూ.3.88 కోట్లు కాజేసినట్లు తెలిపారు. కాగా సైదులు సూర్యాపేటలో పనిచేస్తున్న క్రమంలో ఖాతాదారుల నుండి తీసుకున్న రుణాలకు సుమారు 3 నెలల పాటు వారికి తెలియకుండానే ఈఎంఐ లు చెల్లించాడు. బదిలీ పై ఇక్కడి నుండి హైదరాబాద్ కి వెళ్ళాక ఈఎంఐ లు చెల్లించక పోవడంతో 43 మంది బాధితుల్లో ఒకరైన లగిషెట్టి శ్యామ్ ప్రసాద్ అనే హెడ్ కానిస్టేబుల్ సెల్ కి ఈఎంఐ కట్టడం లేదని నోటీసులు అందాయి. దీనితో కలత చెందిన ఆయన స్థానిక బ్రాంచ్ కి వెళ్ళి ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.

దీనితో ఇంకా కొంత మంది బాధితులు ఉన్నారని తీసుకున్న ఆయన వారితో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ లో మార్చి 11, 2024 న ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ బ్రాంచ్ ఖాతాదారులు సైతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సైదులు అదే నెలలో పరారయ్యాడు. గాలింపు ముమ్మరం చేసిన సికింద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అతన్ని జూన్ నెలలో అరెస్టు చేశారు. కాగా బ్యాంకు ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ ఉప్పల్, రామాంతపూర్, వెస్ట్ మారేడ్ పల్లి శాఖల్లోని ఖాతారులను గుర్తించి వారు కట్టిన ఈఎంఐ డబ్బులను తిరిగి చెల్లించినట్లు సమాచారం. అదే తరహాలోనే తమకు కూడా డబ్బులు చెల్లించాలని సూర్యాపేట బాదితులు కోరుకుంటున్నారు. తమకు వచ్చిన జీతంలో ఈఎంఐలు పోతే తమ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు.

కోర్టు ఆదేశానుసారం ఈ నెల 5న సూర్యాపేటలో విచారణ నిమిత్తం సైదులుని తీసుకురానుండగా పోలీసులు తమ ఆవేదనను ఎస్బీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అందుకు పోలీసులు, బ్యాంకు అధికారులు వీరికి ఏ విధంగా న్యాయం చేయనున్నారో వేచి చూడక తప్పదు.


Similar News