ఆ జిల్లాలో లెక్క తప్పుతున్న లెక్కల మాస్టర్.. ఇదేంపనంటూ విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు పచ్చ జెండా ఊపడంతో కొంతమంది టీచర్లు అక్రమాలకు తెరలేపుతున్నారు...

Update: 2024-07-07 02:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు పచ్చ జెండా ఊపడంతో కొంతమంది టీచర్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. బెస్ట్‌ ప్లేస్‌ కోసం వారు పలు తప్పిదాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తాము కోరుకున్న స్కూల్‌లో విధులు నిర్వహించాలని తప్పుడు పత్రాలు సృష్టించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే సూర్యాపేట జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులను గుర్తించిన అధికారులు వారిని తొలగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలే చాలా చోట్ల బయటపడుతున్నాయి. కోర్టు కేసుల కారణంగా గత కొన్నేళ్లు పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు తిరిగి ప్రారంభమయ్యాయి. జూన్ 8 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కాగా, ముందుగా పదోన్నతులు చేపట్టారు. స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో భార్యాభర్తలు అయిన ఉపాధ్యాయులు స్పెషల్ పాయింట్స్ ఇష్టానుసారంగా వాడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపిస్తున్నారు.

భార్యాభర్తలైన ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రభుత్వం మానవతా కోణంలో 10 ప్రత్యేక పాయింట్స్ అదనంగా కేటాయించించిన విషయం తెలిసిందే. భార్యభర్తలు ఒకే దగ్గర పని చేయాలని దీని ఉద్దేశం. బదిలీల సమయంలో భార్యాభర్తలు అయిన ఉపాధ్యాయులు 8 ఏళ్లకు ఒకసారి ఎవరో ఒకరు మాత్రమే 10 పాయింట్లు వాడుకోవాలని నిబంధన వుంది. కానీ గత 15 ఏళ్లుగా ఇందుకు విరుద్ధంగా జరుగుతూ వస్తోంది. ఉపాధ్యాయుల బదిలీల్లో కేవలం ఈ స్పౌజ్ ఉపయోగించి హెచ్ఆర్ఏ అధికంగా వచ్చే పట్టణ ప్రాంతాలను ఎంపిక చేసుకొని వాడుకుంటున్నారు. ఈ విధంగా 10 పాయింట్లు దుర్వినియోగం అవుతున్నాయని సమాచారం.

తప్పిదాలు:

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు స్పౌజ్ పాయింట్స్ వాడుకొని తన భార్య పని చేసే మండలం కాకుండా హెచ్‌ఆర్‌ఏ అధికంగా వచ్చే స్కూల్‌ను ఎంపిక చేసుకొని బదిలీ పొందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ మ్యాథ్స్ టీచర్ అదే మండలంలో ఖాళీలు ఉన్నా.. హెచ్ఆర్ఏ అధికంగా లభించే మొయినాబాద్ మండలంలోని పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. జీహెచ్ఎం భార్య స్పౌజ్ పాయింట్స్‌ను ఉపయోగించి తన భర్త పని చేసే మొయినాబాద్ మండలం కాకుండా హెచ్ఆర్ అధికంగా లభించే శేరిలింగంపల్లి మండలంలోని పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. ఇలా అనేక మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం మూలంగానే ఇలా జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News