మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర.. జూనియర్ అసిస్టెంట్‌లకు పదోన్నతి

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పదోన్నతి కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూసిన జూనియర్ అసిస్టెంట్స్(junior assistants)కు గ్రేడ్ 3 ఈవోలు(Grade 3 EO)గా దేవాదాయ శాఖ ప్రమోషన్ కల్పించింది.

Update: 2024-10-05 14:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పదోన్నతి కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూసిన జూనియర్ అసిస్టెంట్స్(junior assistants)కు గ్రేడ్ 3 ఈవోలు(Grade 3 EO)గా దేవాదాయ శాఖ ప్రమోషన్ కల్పించింది. జీవో 134 ద్వారా మొత్తం 33 మంది జూనియర్ అసిస్టెంట్‌లు ఈవోలుగా పదోన్నతి పొందారు. సచివాలయంలో శనివారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రమోషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్యనైనా త్వరిత కాలంలోనే పరిష్కరిస్తుందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్స్ అనేవి సాధారణ ప్రక్రియలో భాగమనీ, అటువంటి ప్రమోషన్స్ ను కూడా చేపట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను మానసికంగా హింసించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రమోషన్ వచ్చి ఉంటే వారి సేవలతో దేవాదాయ శాఖ మరింత బలోపేతం అయ్యేదన్నారు.

ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోలకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందన్నారు. ఈవోలుగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ వంటి నిర్ణయాలతో దేవాదాయ శాఖ ఆస్తులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న దేవాలయ భూములకు విముక్తి ప్రసాదించేందుకు దేవాదాయ శాఖ లీగల్ ఆఫీసర్ ను నియమించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు, అడిషనల్ కమిషనర్లు క్రిష్ణవేణి, జ్యోతి, దేవాదాయ శాఖ దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, పదోన్నతి పొందిన ఈవోలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News