Beerla Ilaiah: పేదల కోసం సీఎం రేవంత్ మంచి పనిచేస్తున్నారు

మూసీ ప్రక్షాళనతో 25 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.

Update: 2024-10-05 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ ప్రక్షాళనతో 25 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఆ పేదలకు న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ నాగోల్ లోని శుభం గార్డెన్స్ ఏర్పాటు చేసిన మూసి ప్రక్షాళన చేద్దాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. వికారాబాద్ వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం మధ్య నుండి వెళ్తున్న మూసీ, ఒకప్పుడు హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజల దాహార్తి తీర్చిందన్నారు. కానీ 1980 తర్వాత పారిశ్రామిక అభివృద్ధితో మూసీ మురికికూపంలా తయారైందన్నారు.

దీంతో పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదలకు నిత్యం సమస్యగా మారిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కు కంకణం కట్టారన్నారు. మూసి చీకట్లో బతుకుతున్న పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. బీఆర్ ఎస్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం విచిత్రంగా ఉన్నదన్నారు. గతంలో ముసీ రివర్ ఫ్రంట్ కార్పొరేట్ తెచ్చిందే బీఆర్ ఎస్ అని గుర్తు చేశారు. అప్పుడే అక్రమ నిర్మాణాలు కూల్చాలని నిర్ణయం తీసుకున్నా, వివిధ ఒత్తిళ్లకు బీఆర్ఎస్ లొంగిపోయిందన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదని స్పష్టం చేశారు.


Similar News