విద్యార్థుల లో విద్యా ప్రమాణాలు పెరగాలి : కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Update: 2024-07-06 13:48 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, వసతిగృహాల నిర్వహణ, విద్యా ప్రమాణాల పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో గుర్తించిన మైనర్ రిపేర్లు, త్రాగునీరు, ఎలక్ట్రికల్ పనులు, మరుగుదొడ్ల లో నీటి సదుపాయం, రిపేర్లను ఇంజనీర్లు 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తారని సూచించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన అందించాలని సూచించారు. 

పాఠశాలలు, వసతిగృహల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా విద్యార్థులకు విద్యతో పాటు, క్రీడలు నిర్వహించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రతి పాఠశాల, వసతి గృహంలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని ఎక్కడ కూడా సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలలు, వసతిగృహాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు విజ్ఞానం పెంపొందే దిశగా కొత్త పుస్తకాలను అందిస్తామని చదువుతోనే గౌరవ స్థానం దక్కుతుందని ఉత్తీర్ణత పొందిన విద్యారుల్లో 75 శాతం మార్కుల పర్సెంటేజ్ ఉండాలని, అలాగే ప్రతి పాఠశాలలోని విద్యార్థులు 10/10 గ్రేడ్ వచ్చేలా బోధన ఉండాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయుల విది నిర్వహణలో మార్పు కనబడాలని అన్నారు. తదుపరి సంక్షేమ శాఖల వారీగా పలు అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీటీడీఓ శంకర్, బీసీ వెల్ఫేర్ అధికారి అనసూర్య, మైనారిటీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News