పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సరిహద్దు వెంట పటిష్ట నిఘా
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దు వెంట పటిష్ట నిఘా ఉందని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే వెల్లడించారు.
దిశ, సూర్యాపేట : పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దు వెంట పటిష్ట నిఘా ఉందని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే వెల్లడించారు. అంతే కాకుండా గత ఎన్నికల్లోని పలు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బైండోవర్ చేయాలని సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ నాగేశ్వర రావుతో కలిసి ఎస్పీ కోదాడ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెండింగ్ కేసులు వేగంగా దర్యాప్తు చేసి చార్జిషీట్‌లను త్వరగా కోర్టులకు పంపించాలని చెప్పారు.
కేసుల ఆధారాలుగా టెక్నికల్ ఆధారాలను రికార్డ్ చేసుకోవాలని, దొంగతనం కేసులు త్వరగా ఛేదించాలని ఎస్పీ అధికారులకు సూచించారు. గంజాయి కేసుల నమోదు,సైబర్ నేరాల నమోదు రికవరీలో ప్రణాళిక ప్రకారం పని చేయాలని, సైబర్ మోసాల పట్ల ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ఎన్నికల వేళ జిల్లా సరిహద్దు వెంట అక్రమ రవాణా, అక్రమ కార్యకలాపాలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలని, క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి జిల్లాలోకి అక్రమ సరఫరా లేకుండా నిరోధించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర శాఖ సిబ్బందితో సమన్వయంతో టీమ్స్ వర్క్ చేయాలని అన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై స్పందన వేగంగా ఉండాలని బ్లూ కొట్స్ సిబ్బంది విధులు సమర్ధంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో కోదాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య,సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పాండరి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.