రజాకార్ సినిమా మత చరిత్ర కాదు మన చరిత్ర
తెలంగాణ సాయుధ పోరాటం గురించి, మన చరిత్ర గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు రజాకర్ సినిమాను తీశానని ఇది మత చరిత్ర కానే కాదని సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ చెప్పారు.
దిశ, చిట్యాల: తెలంగాణ సాయుధ పోరాటం గురించి, మన చరిత్ర గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు రజాకర్ సినిమాను తీశానని ఇది మత చరిత్ర కానే కాదని సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా చిట్యాల పట్టణ కేంద్రంలోని సుజనా 70 ఎంఎం థియేటర్‌లో ఆడుతున్న రజాకర్ సినిమాను ప్రేక్షకులతో కలిసి సినిమా యూనిట్ సభ్యులు, నటీనటులు వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల పాలనలో తీవ్ర హింసకు గురైన తెలంగాణ ప్రజల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా అని సినిమాను మన సినిమాగా భావించి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాను కొన్ని వర్గాలకు చెందినదిగా, ఒక మతానికి సంబంధించినదిగా చేయలేదని, తెలంగాణలో జరిగిన వాస్తవ పరిస్థితులను మాత్రమే సినిమాగా తీశానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రజాకార్ల పాలనలో జరిగిన ఎన్నో హింస సంఘటనలకు నిదర్శనంగా ఈ చిత్రాన్ని జిల్లాలోనే చిత్రీకరించడం జరిగిందన్నారు. తెలంగాణ పోరాటంలో నార్కెట్పల్లి చరిత్ర, గుండ్రంపల్లి సంఘటన వంటి అంశాలను ప్రధానంగా తెలియజేయడం జరిగిందన్నారు.
తనకు ఈ చిట్యాలతో ఉన్న బంధం విడదీయరానిదని చిన్నతనం నుండి చిట్యాలలో పెరిగి, చిట్యాలలోని ఈ థియేటర్‌లోనే సినిమాలు చూస్తూ ఎప్పటికైనా తాను కూడా సినిమా రంగంలోకి వెళ్లి తాను తీసిన సినిమా ఈ థియేటర్‌లో ఆడే విధంగా లక్ష్యం పెట్టుకున్నాను అన్నారు. సినిమాల్లోకి వెళ్లాలనే బీజం చిట్యాలలోని ఈ థియేటర్ నుండే ఏర్పడిందన్నారు. తెలంగాణలో జరిగిన ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించావని ఎంతోమంది ప్రముఖులు ప్రశంసించడం గర్వకారణంగా ఉందన్నారు. చిన్న చిత్రంగా ప్రారంభమైన రజాకర్ ప్రయాణం కొద్ది రోజుల్లోనే పెద్ద చిత్రాల స్థాయిలో ఆదరణ దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించిన కాశిం రాజ్వి పాత్రదారులు, అనసూయ, ఇంద్రజ ప్రేమ వంటి నటీనటులు ఉత్తమ నటన కనబరిచి ఆ పాత్రలకు జీవం పోశారన్నారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించి అక్కున చేర్చుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.