ఈ ప్రిన్సిపల్ మాకొద్దు.. ఆమె నోరు తెరిస్తే బూతు పంచాంగమే..

ఆమెది క్రూరత్వం కలిగిన మైండ్. ఆమె చూడటానికే ఒక మహిళ ప్రిన్సిపల్ గా కనిపిస్తుంది కానీ ఆమె వికృత చేష్టలు మమ్మల్ని తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోందని సూర్యాపేట జిల్లా, మండలంలోని బాలెంల వద్ద గల తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2024-07-04 13:52 GMT

దిశ, సూర్యాపేట : ఆమెది క్రూరత్వం కలిగిన మైండ్. ఆమె చూడటానికే ఒక మహిళ ప్రిన్సిపల్ గా కనిపిస్తుంది కానీ ఆమె వికృత చేష్టలు మమ్మల్ని తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోందని సూర్యాపేట జిల్లా, మండలంలోని బాలెంల వద్ద గల తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు నిరసనగా గురువారం విద్యార్థినులు గురుకుల కళాశాల ముందు బైఠాయించి బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ తో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం విద్యార్థినులు మాట్లాడుతూ కళాశాలలో సరైన వసతులు లేవని ప్రిన్సిపాల్ శైలజని అడిగితే బూతు పురాణమే వినిపిస్తోందని అన్నారు. ఇంకా మాట్లాడితే ఇక్కడి నుండి మీకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తానని వేధింపులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతే కాకుండా తాము గదులలో స్నానానికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చి వీడియోలు తీస్తుందని, మీరు ఎక్కువగా మాట్లాడితే ఇవి బయటికి పంపిస్తానని మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడ మేము పెట్టిన భోజనం తినాలని, మీకు ఉచితంగా అందిస్తున్నామని కలత చెందే మాటలతో తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఆమె ప్రిన్సిపాల్ గా పనికి రాదని, ఆమె మాకు వద్దేవద్దంటూ నినాదాలు చేశారు. అందుకు ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు మారినా విద్యార్థుల వసతులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాలల్లో సరైన సదుపాయం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. అందుకు అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమౌతుందన్నారు. ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు సౌకర్యాలు కల్పించి, విద్యార్థినులు భవిష్యత్ ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.


Similar News