తెలంగాణలో దేవాలయాలకు పూర్వవైభవం: మంత్రి

Update: 2022-02-05 14:40 GMT

దిశ, అనంతగిరి: తెలంగాణలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. అనంతగిరి మండల కేంద్రంలో హనుమంతగిరి గుట్టపై హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి శనివారం వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలను పట్టించుకోలేదని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన ప్రాచీన దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఆలయాల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై దృష్టిసారించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో 100 మంది దళితులకు దళిత బంధు అందజేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని కొనియాడారు. హరిహరసుతుడు అయ్యప్పస్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని అన్నారు. అంతకుముందు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల నిధులు కేటాయించిందని వారు పేర్కొన్నారు.

ముఖ్య అతిథులను దేవాలయ కమిటీ వారు సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వేల మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీనారాయణ, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, జడ్పిటీసీ ఉమా శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వరరావు, కోదాడ ఎంపీపీ కవితా రెడ్డి, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ట్రస్ట్ చైర్మన్ గురుస్వామి కొండపల్లి వాసు, గునుకుల స్వరూపా వెంకట్ రెడ్డి, ఈదుల కృష్ణయ్య, వీరయ్య, గోళ్ళ వీరబాబు, చార్లెస్, పుల్లయ్య గౌడ్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News