టికెట్ కోసం పాకులాడే వ్యక్తులం కాదు

భువనగిరి పార్లమెంట్ టికెట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మి కావాలని పట్టు పడ్తున్నాడని సామాజిక మాధ్యమాల్లో, వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, మాపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-03-22 15:28 GMT

దిశ, మునుగోడు: భువనగిరి పార్లమెంట్ టికెట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మి కావాలని పట్టు పడ్తున్నాడని సామాజిక మాధ్యమాల్లో, వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, మాపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి లక్ష్మీ దరఖాస్తునే చేసుకోలేదన్నారు. భువనగిరి పార్లమెంట్ టికెట్ బీసీలకు ఇవ్వాలన్నదే నా అభిప్రాయమన్నారు. ప్రజల మనసులో ఏముందో సర్వే చేసుకుని ఎవరికి ఇవ్వాలనేది మీరే నిర్ణయం తీసుకోమని అధిష్టానానికి చెప్పానన్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు నాతో పాటు లక్ష్మీ చేసిందన్నారు. పదవుల కోసం ఎప్పుడు కోమటిరెడ్డి కుటుంబం పాకులాడలేదన్నారు. కరోనా సమయంలో సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి రూ. 5 కోట్లతో 50 వేల కుటుంబాలకు సహాయం చేసిందన్నారు.

బీజేపీ బీసీకి టికెట్ ఇచ్చిందని మనం కూడా బీసీకీ ఇస్తే బాగుంటుందని అధిష్టానానికి తెలిపామన్నారు. నామినేటెడ్ పోస్టులకు ఏనాడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశపడలేదన్నారు. ప్రజలు కోరుకుంటే అధిష్టానం ఆదేశిస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ ఇస్తే బాగుంటుందని ప్రజలు కొట్టుకుంటున్నారన్నారు. ఆనాడు పార్టీ మారింది కేసీఆర్ కుటుంబ పాలన, నియంత పాలన అంతం కోసమేనన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానన్నారు. త్వరలో మంత్రి వర్గంలో నాకు అవకాశం కల్పిస్తారని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవ్వరికి భువనగిరి టికెట్ ఇచ్చిన రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 12 నుండి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ప్రజల పక్షాన కొట్లాడినం, ప్రజల కోసం పోరాడినం కానీ పదవుల కోసం ఏనాడు కోట్లాడలేదన్నారు. జగదీశ్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని నోరు అదుపులో ఉంచుకోకపోతే నేను సూర్యపేటకు రావాల్సి వస్తుందని హెచ్చరిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన షాక్‌కు కేసీఆర్ బాత్రూమ్‌లో జారీ పడ్డాడన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే తెలంగాణ పేగు బంధం కేసిఆర్‌కు తెగిపోయిందన్నారు.ఈ సమావేశంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీలు తాడూరు వెంకటరెడ్డి, గుప్తా ఉమాదేవి, నాయకులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, జాజుల అంజయ్య గౌడ్, బుజ్జి, భీమనపల్లి సైదులు, పాలకూరి యాదయ్య, జాల వెంకన్న యాదవ్, నకిరేకంటి యాదయ్య, పాల్వాయి చెన్నారెడ్డి, బూడిద లింగయ్య యాదవ్, తాడికొండ సైదులు, సాగర్ లింగస్వామి, ఎండీ అన్వర్, కోడి గిరి బాబు, చంద్రశేఖర్, దోటీ వెంకటేశ్వర్లు, పల్లె వెంకన్న, జంగిలి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Similar News