‘సీఎం సారూ! దరఖాస్తుల గడువు పొడగించరూ!’.. ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థుల ఆవేదన
దిశ,నల్లగొండ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 21వ తేదీన మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు కాగా.. నిన్న శనివారంతో పూర్తయింది.
అయితే ఈ దరఖాస్తు కోసం నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, పారామెడికల్ ఆథరైజ్ సర్టిఫికేషన్ అడగడం, ఇచ్చిన 14 రోజుల గడువులో 5 రోజులు సెలవులే ఉండడంతో దాదాపు 20 వేల మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే వారంతా దరఖాస్తు సమయాన్ని మరింత పొడిగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌ను అభ్యర్థిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు దూరం చేయొద్దంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘దిశ’తో తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు.