మునుగోడు నా అడ్డా : కోమటి రెడ్డి
నియోజకవర్గ ప్రజలే నా ప్రాణం అని, నేను ఏది చేసిన ప్రజల మేలుకోసమే అని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
దిశ, చండూరు: నియోజకవర్గ ప్రజలే నా ప్రాణం అని, నేను ఏది చేసిన ప్రజల మేలుకోసమే అని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన నామినేషన్ కార్యక్రమానికి మునుగోడు క్యాపు కార్యాలయం నుంచి చండూరు వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తనను కొందరు నియోజకవర్గంలో తిరగనని అసత్య ప్రచారం చేస్తున్నారని నేను సింహం లాంటోడిని ఒక్కసారి వస్తే వందల మంది పేదలకు సహాయం చేస్తానని, కొందరు నక్క లాంటివారని ఎన్నిసార్లు తిరిగిన ఏమి చేయలేరని పరోక్షంగా కూసుకుంట్లను ఘాటుగా విమర్శించారు.
అవినీతి, కుటుంబపాలన చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దించటానికే పార్టీ మారానని అదే నా లక్ష్యమని ప్రజలకు తెలిపారు. నిధులు ఇవ్వకపోతే నా రాజీనామాతో వందమంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రిని ప్రజల పాదాల వద్దకు తెచ్చానన్నారు. మునుగోడు పేరు చెబితే మూడు నెలలు ముఖ్యమంత్రికి నిద్ర పట్టలేదన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడిద్దాం ప్రజాస్వామ్యంను బతికిద్దాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేటీఆర్ లక్షకోట్ల అవినీతిని బయటపెడతా అని సంచలన ఆరోపణ చేశారు.
పది సంవత్సరాల కాలంలో కేసీఆర్, ఆయన తొత్తులు లక్షల కోట్లు దోచుకున్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని బీజేపీ కి ఓటు వేస్తే బీఆర్‌ఎస్ కు వేసినట్లే అని ఓటర్లకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నన్ను గెలిపిస్తే సిద్దిపేట, సిరిసిల్లకు ధీటుగా మునుగోడును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కమ్యూనిస్టుల మద్దతుతో ఎన్నికల్లో విజయం నాదే అని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో మేము బీజేపీని ఓడించాం కానీ రాజగోపాల్ రెడ్డిని కాదన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నేలికంటి సత్యం, మునుగోడు జెడ్పీటీసీ నారాబోయిన స్వరూప రాణి, నారాబోయిన రవి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రేమచందర్ రెడ్డి, నాంపల్లి జెడ్పీటీసీ ఏ.వి.రెడ్డి, నాంపల్లి వైస్ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న , మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.