Nagarjuna Sagar : నాగార్జున సాగర్ అందాలు చూడతరమా..
నాగార్జున సాగర్.. చారిత్రక ప్రాంతంలో వెలసిన ఆధునిక దేవాలయం.
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్.. చారిత్రక ప్రాంతంలో వెలసిన ఆధునిక దేవాలయం. రైతన్న నీటి అవసరాలతో పాటు విద్యుత్తు అవసరాలను తీర్చే ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు ప్రపంచంలోనే ఓ అద్భుతం. ఇక్కడి నాగార్జున కొండ పై ఆచార్య నాగార్జునుడు తత్వాలను బోధించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆనకట్ట ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం శ్రీపర్వతం, విజయపురి, నాగార్జున కొండగా ప్రసిద్ధిగాంచింది. తొలుత ఈ ప్రాంతంలో శాతవాహనులు ఉండేవారు. మూడో శతాబ్దంలో ఇక్ష్వాకులకు నిలయంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని నాగార్జునసాగర్ డ్యాం ను చూడడానికి రెండు కళ్లు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు. గేట్ల ద్వారా నీటి విడుదల దృశ్యాన్ని దగ్గరి నుంచి చూస్తే ఒళ్లు పులకరించడం ఖాయమని అక్కడికి వెళ్లొచ్చిన వారు చెబుతారంటే అక్కడి జలదృశ్యం ఎంత రమణీయంగా ఉంటుందో ఊహించుకోవచ్ఛు నాగార్జునసాగర్ వద్ద అద్భుతమైన జలదృశ్యం కనువిందు చేస్తోంది. కృష్ణమ్మ పరవళ్లతో జలసవ్వడి 22 గేట్ల నుంచి నీటిని దిగువుకు వదులుతున్నారు. వేల కొద్ది మయూరాలు పురి విప్పి నాట్యం చేస్తున్నాయా.. కోటాను కోట్ల మంచు ముత్యాలు నింగి నుంచి నేలకు జాలువారుతున్నాయా అన్నంత వయ్యారంగా జలాలు కిందికి దూకుతున్నాయి. ఉషోదయపు నీ రెండలో మిల మిలా మెరిసిపోతూ.. పాల నురగలు కక్కుతూ ఉవ్వెత్తున కిందిగి దూకి బిరబిరా పరుగులెడుతోంది కృష్ణమ్మ. సాగర్ నుంచి జాలువారుతున్న జలాల సోయగాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని... నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. ఎగువన ప్రవాహం పెరుగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం ప్రపంచంలో ఏడోస్థానం, భారతదేశంలో ద్వితీయ స్థానం కల్గిన బహుళార్థక ప్రాజెక్ట్. దీని కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 22 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందుతోంది. 26 గేట్లను కలిగి ఉన్న ఈ డ్యాం నీటిమట్టం గరిష్ఠ స్థాయి (590 అడుగులు)కు చేరినపుడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తారు. 600 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే జల సవ్వడి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
ప్రధాన విద్యుత్ కేంద్రం..
ఇందులోని 8 యూనిట్ల ద్వారా 810 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా వేసవికాలంలో విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి వీలుగా దిగువనున్న నీటిని జలాశయంలోకి రివర్స్ పంపింగ్ చేయడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్ఛు
అనుపు : ఇది సాగర్ జలాశయానికి అనుకొని ఉన్న ప్రాంతం. ఇక్కడి నది ప్రాంతమంతా బీచ్‌ను పోలిఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడ బౌద్ధమతానికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి.
బుద్ధవనం..
సాగర్ హిల్‌కాలనీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక సంస్థ సంయుక్తంగా సుమారు 270 ఎకరాలలో బుద్ధవనం నిర్మిస్తున్నారు. ఇందులో 8 రకాల వివిధ పార్కులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 5 థీమ్ పార్కుల పనులు పూర్తి చేశారు. ఇక్కడ ప్రపంచంలోని వివిధ దేశాలలోని బౌద్ధమత స్తూపాలు, బుద్ధుని జననం నుంచి మరణం వరకు తెలియచేసే చిత్రాలున్నాయి. శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవకాన బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సెల్ఫీలు దిగుతూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. అయితే పర్యాటకులు ఆసక్తి కనపరచడంతో బుద్దవనానికి సైతం తాకిడి నెలకొన్నది.
పర్యాటకుల సందడి..
సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. రోడ్ల పై ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ఆ జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో డ్యాం పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి. శివాలయం పుష్కరఘాట్, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం సమీపం, కొత్త వంతెన, లాంచీస్టేషన్ జనంతో కిటకిటలాడాయి. కృష్ణా నదిలో లాంచీ జాలీ ట్రిప్పు, నాగార్జునకొండకు లాంచీల్లో వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి కనబర్చారు.