హుజూర్‌నగర్ కాంగ్రెస్‌లో ‘‘టికెట్’’ పోటీ.. ఉత్తమ్ అసెంబ్లీకా.. పార్లమెంట్‌కా..!?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయలను శాసించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం ఆ పార్టీలో ఎదురు గాలులు వీస్తున్నాయి.
దిశ, నేరేడుచర్ల: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయలను శాసించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం ఆ పార్టీలో ఎదురు గాలులు వీస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత క్రమేనా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. రేవంత్‌తో ఉత్తమ్ కూడా అంటి ముట్టన్నట్లు వ్యవరిస్తున్నారని సమాచారం. కొన్ని సందర్భలలో అధిష్టానం కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయనకు సీరియస్‌గా చెప్పినట్లు తెలుస్తుంది.
అయితే గత రెండు రోజుల క్రితం తీన్మార్ మల్లన్న కనిపించకపోవడంతో రేవంత్ రెడ్డి స్పందించి మాట్లాడాని ఉత్తమ్ తప్పుబట్టి సోషల్ మీడియా షేర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసే యాడ్స్‌లో ఫ్లెక్సీల కానీ ఎక్కడ రేవంత్ ఫొటో లేకుండా చూస్తున్నారని నియోజకవర్గం ఎవరు తనకు తెలియకుండా వెళ్ళవద్దని ఎవరైనా రేవంత్‌ను కలిసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరని వినికిడి.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఒక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటు అయినప్పటి నుంచి టీపీపీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా పోటీచేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కూడా పని చేశారు. 2018 ఎన్నికలలో హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణ వలన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీచేసి గెలుపొంది ఎమ్మెల్యేగా రాజీనామా చేసి జాతీయ రాజకీయలలోకి వెళ్లారు. ఆ సమయంలో 2018 ఎన్నికలలో కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలైయింది.
ఆ తర్వాత హుజూర్‌నగర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలలో ఉత్తమ్ పద్మావతి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై ఓటమి మళ్ళీ ఓటమి పాలైయింది. ఆ తర్వాత ఉత్తమ్ పద్మావతి కోదాడ కు వెళ్ళి పోయారు. అప్పటి నుండి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే నియోజకవర్గం ఇన్ చార్జిగా వ్యవరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఉత్తమ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న దానికి అదిష్టానం మాత్రం ఎంపీగా మళ్ళీ పోటీ చేయించేందుకే మెుగ్గుచూపుతుందని సమాచారం.
ఇద్దరిలో ఒక్కరికే అసెంబ్లీ టికెటా..!?
హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయగా కోదాడ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి పద్మావతి పోటీ చేశారు. 2014 ఎన్నికలలో పద్మావతి గెలుపొందినారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలలో ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్యేగా ఒకరికి ఎంపిగా అదిష్టానం ఇచ్చే అవకాశం ఉందని ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఇద్దరికీ ఇస్తే మిగతా నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు తనతో పాటు తన కొడుకులకు కూడా టికెట్ ఆశిస్తున్నారని.. దానికి చెక్ పెట్టెందుకు కుటుంబానికి ఒక్కటే టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. అలా జరిగితే కోదాడ నుండి ఎమ్మెల్యేగా పద్మావతికి అవకాశం కల్పించి మళ్లీ ఎంపీగా ఉత్తమ్‌ను పంపించే ఆలోచనలు అధిష్టానం దృష్టిలో ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ టికెట్‌పై ఆశవాహుల ఎదురుచూపులు..
ఉత్తమ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి హుజూర్‌నగర్ అసెంబ్లీ టికెట్ రాకపోతే ఆ సీటుకోసం చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. అందు కోసమే కొందరు ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నియోజకవర్గ నాయకులు కలిసి తమకు కేటాయించాలని కోరుకున్నట్లు సమాచారం. అందులో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, ఎన్ఆర్ఐ జైపాల్ రెడ్డి, ఓజో ఫౌండేషన్ చైర్మెన్ పిల్లుట్ల రఘు కూడా ఆయన కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అలాగే అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు మైక్ టీవీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి కూడా సిద్ధంగా ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
ప్రారంభం కాని హథ్ సే..హథ్ జోడో యాత్ర..
రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చేందుకు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ప్రవేశ పెట్టబోయే పథకాలను వివరిస్తు ప్రజలకు దగ్గరైందుకు యాత్రను చెపడుతున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం ఈ యాత్ర చేస్తారా లేదా అనే సందిగ్ధత పార్టీలోని నాయకులలో కార్యకర్తలో మెదులుతుంది. అయితే ఇదే సందర్భంలో ఈ యాత్రను త్వరలో ఎన్ఆర్ఐ జైపాల్ రెడ్డి చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా తయారు చేసిన దానిని జైపాల్ రెడ్డి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసినట్లు సమాచారం. అయితే ఉత్తమ్‌ను కాదని జైపాల్ రెడ్డి హథ్ సే.. హథ్ జోడో యాత్ర చేస్తారా లేదా అనే సందేహం నెలకొంది..
అసెంబ్లీకే పోటీ చేస్తానంటున్న ఉత్తమ్..
రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 50వేల భారీ మెజార్టీతో గెలుస్తానని పలు సందర్భాలలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలవడం కూడా అంతా సాధ్యం కాని విషయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. ఉత్తమ్ ఏ ధీమాతో 50,000 మెజార్టీ వస్తుందని చెబుతున్నారో వారికే అర్థం కాని పరిస్థితిగా నెలకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయ పరిస్థితులను అంచనా వేయగలరని ఆరోజు పరిస్థితి ఏం చేస్తాడో వేచి చూడవలసి ఉంది.
బీఆర్ఎస్ పార్టీ వైపు చూపులు..?
ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఎస్ఆర్ పార్టీ వైపు కూడా చూస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తుంటే దానిని వాస్తవం అనే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు సమర్థిస్తూ బహిరంగనే చర్చిస్తున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు హుజూర్‌నగర్ నుంచి తన భార్య పద్మావతికి కోదాడ నుండి టికెట్లు కావాలని కోరినట్లు అలాగే గెలిస్తే మంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రపోజల్‌ను పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి స్పష్టత రాలేదని దానికోసమే ఉత్తమ్ ఎదురు చూస్తున్నాడని ప్రజలలో చర్చ జరుగుతుంది. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు వేచిచూడాలి.