కోమటిరెడ్డి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలి- చెరకు సుధాకర్
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడై ఉండి తెలంగాణ ఉద్యమ నాయకుడిని
దిశ, చిట్యాల : కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడై ఉండి తెలంగాణ ఉద్యమ నాయకుడిని అయినా నన్ను దూషించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని వెంటనే అతని పార్లమెంటు సభ్యత్వం ను రద్దు చేయాలని పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామంలో ఆయన తండ్రిగారైన చెరుకు ఉష గౌడ్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుల పట్ల అనుచితంగా మాట్లాడడం అతని అహంకారాన్ని తెలియజేస్తుందన్నారు.
రాష్ట్రంలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని బలపరిచి పని చేయించాల్సిన సీనియర్ నాయకుడు ఈ రకంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ పార్లమెంటు సభ్యుడై ఉండి ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు. బాంబులు వేసి చంపుతానని ఒక టెర్రరిస్ట్ వలె బెదిరించడం ఆయన నిజస్వరూపాన్ని తెలియజేస్తుందన్నారు. కోమటిరెడ్డి తో గతంలో ఎప్పుడు వైరం లేదని కానీ ఒక బీసీ నాయకున్ని ఈ విధంగా అవమానించడం ఆయనకే చెల్లిందనీ ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేయాలన్నదే కోమటిరెడ్డి లక్ష్యంగా ఉందన్నారు. ఈ విషయాన్ని త్వరలోనే పార్లమెంటు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ సమావేశంలో పిసిసి అధికార ప్రతినిధులు పున్న కైలాష్, అద్దంకి దయాకర్ లు కూడా ఉన్నారు.