దిశ, వెబ్‌డెస్క్: యువత క్రీడల్లో రాణిస్తూనే, జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. శనివారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను మేడి ప్రియదర్శిని ప్రారంభించించారు. అనంతరం పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సంరద్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని, చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ పాల్గొనాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. ఆటలు ఆడటం మూలంగా శారీరకంగా ధృడంగా ఉండటంతో పాటు మానసికంగా కూడా చురుగ్గా ఉంటామని తెలిపారు.
పల్లెటూర్లలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడానికే బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో ఉన్న యువత టాలెంట్‌ను వెలికి తీయడానికి ప్రతీ నెల వినూత్న కార్యక్రమాలు రూపొందించి ప్రపంచానికి వారి ప్రతిభను పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, పదిరోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో 24 జట్లు పాల్గొంటున్నాయి. విజేతకు రూ.10,000, రన్నర్‌కు రూ.5000 బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మేడి శ్రీనివాసులు, ఊట్కూరి రాజు, మేకల అరుణ్, గద్దపాటి రమేష్, తాటిపాముల తరుణ్ తేజ్, మేడి వాసుదేవ్, బొల్లాలి వంశీ, గణేష్, కార్తిక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.