మినీ అంగన్వాడీ అప్ గ్రేడేషన్ పేరుతో.. ఐసీడీఎస్ లో అక్రమ వసూళ్లు..

చిన్నపిల్లలకు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం పూర్వ ప్రాథమిక విద్యను పరిచయం చేయడం ఆ శాఖ అధికారుల విధి.

Update: 2024-07-04 12:16 GMT

దిశ, నల్లగొండ బ్యూరో : చిన్నపిల్లలకు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం పూర్వ ప్రాథమిక విద్యను పరిచయం చేయడం ఆ శాఖ అధికారుల విధి. కానీ ఈ మధ్యకాలంలో చేయాల్సిన పనిని వదిలిపెట్టి వివిధ పనుల పేరుతో వసూళ్ల ఘట్టానికి అధికారులు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే దాదాపు ఐదేళ్లకు పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ మినీ అంగన్వాడి టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. నాటి అధికార పార్టీకి అనుసంధానంగానే ఈ సంఘం ఏర్పడినప్పటికీ మినీ అంగన్వాడి టీచర్లు ప్రభుత్వ పెద్దల పై ఒత్తిడి తెచ్చారు. వాళ్ళ ఆందోళన ఫలితంగా గత ఎన్నికలకు ముందు మినీ అంగన్వాడి కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు అప్ గ్రేడేషన్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ఆ జీవో ప్రకారం జిల్లాలో ఐసీడీఎస్ అధికారులు నిన్న మొన్నటి వరకు మినీ అంగన్వాడి కేంద్రాల టీచర్గా పని చేసిన సిబ్బందికి ఆ కేంద్రాలను ప్రధాన కేంద్రంగా మారుస్తూ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఐసీడీఎస్ అధికారులు ఇవ్వాల్సిన ఆదేశాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారులు ఖరీదు కట్టి టీచర్ల నుంచి బలవంతంగా వసూలు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

యాదాద్రి భువనగిరి జిల్లాలో మినీ అంగన్వాడి టీచర్లు సుమారు 80 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో రామన్నపేట క్లస్టర్ పరిధిలో 28 మంది టీచర్లు ఉన్నారు. క్లస్టర్ స్థాయి అధికారి రామన్నపేట క్లస్టర్ లో పనిచేసే మినీ టీచర్ల నుంచి ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 20 నుంచి 30వేల వరకు వసూలు చేసినట్లు వినిపిస్తోంది. ఈ లెక్కన సుమారు రూ.7 నుంచి 8 లక్షల వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గత కొద్దిరోజుల క్రితం రామన్నపేట పట్టణంలో ఓ అంగన్వాడీ ఆయాకు ప్రమోషన్ ఇచ్చేందుకు దాదాపు రూ.2లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భువనగిరి, ఆలేరు, మోత్కూరు ప్రాజెక్టులలో కూడా రూ.10 నుంచి రూ.15 వేలు ఇవ్వాలని ఆ క్లస్టర్ అధికారులు టీచర్లను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.. పక్క క్లస్టర్ లో డబ్బులు ఇచ్చాక మీరు ఎందుకు ఇవ్వరని వాళ్ల పై అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఐసీడీఎస్ అధికారుల అక్రమ వసూళ్ల దందా పై విచారణ జరిగితే ఇంకా అనేక విషయాలు వచ్చే అవకాశం ఉందని సంబంధిత కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నా దృష్టికి రాలేదు.. కృష్ణవేణి, ప్రాజెక్టు డైరెక్టర్ ఐసీడీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా

అంగన్వాడి టీచర్ల నుంచి డబ్బులు వసూలు చేశారన్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా తనకు చెబితే విచారణకు ఆదేశిస్తా బాధ్యుల పై చర్యలు తీసుకుంటానని అన్నారు.


Similar News