చినుకు పడితే చిత్తడే… మరమ్మతులకు నోచుకోని రోడ్లు

మండలంలోని పలు గ్రామాల్లో మధ్య ఉన్న అంతర్గత రహదారులు అధ్వానం గా తయారయ్యాయి. ఏళ్లుగా మరమ్మత్తులు చేపట్టకపోవడంతో రాకపోకలు కష్టంగా మారింది

Update: 2024-09-07 09:18 GMT

దిశ,మాడుగులపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో మధ్య ఉన్న అంతర్గత రహదారులు అధ్వానం గా తయారయ్యాయి. ఏళ్లుగా మరమ్మత్తులు చేపట్టకపోవడంతో రాకపోకలు కష్టంగా మారింది. అసలే వర్షాకాలం చినుకు పడితే రోడ్లన్ని సముద్రాన్ని తలపించేలా అధ్వానంగా తయారవుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారులు సైతం దెబ్బతిని గోతులుగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీనికి తోడు ఎత్తుపల్లాలుగా మారిన రోడ్లలో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురి అయ్యే పరిస్థితి ఏర్పడింది.

మాడుగులపల్లి మండల పరిధిలోని చెరువుపల్లి వైపు వెళ్లే రోడ్లు గుంతలమయం అయ్యాయి. ఈ దారి గుండా చెరువుపల్లి, దాచారం, నారాయణపురం, గారకుంటపాలెం, కనేకల్, ధర్మపురం, గోపాలపురం, మాచనపల్లి,కేశవపురం, గ్రామాలకు వెళ్ళవచ్చు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. ఆ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లన్నీ మరమ్మత్తులు చేసే విధంగా చూడాలని మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. గత 21 సంవత్సరాల క్రితం రోడ్డు వేశారు. ఇంతవరకు మరమ్మతులు చేసిన పాపాన పోలేదని అన్నారు.


Similar News