తాము ఎప్పటికీ మిత్రులమే.. ఒకే వేదికపై తేల్చి చెప్పిన ఆ ఇద్దరు నాయకులు

భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి గంగా-జమునా-తెహజీబ్ అని గుర్తింపు

Update: 2024-09-16 12:42 GMT

దిశ,సూర్యాపేట : భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి.గంగా-జమునా-తెహజీబ్ అని గుర్తింపు ఉంటే సూర్యాపేట పట్టణానికి తెలంగాణలో ఆ పేరు ఉందని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.భానుపురి గణేష్ ఉత్సవ సమితి సామూహిక నిమజ్జనోత్సవ శోభాయాత్ర లో భాగంగా ఆయన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పలు గణేష్ ఉత్సవ కమిటీల్లో ముస్లిం సోదరులు కూడా భాగమవడం సంతోషించదగిన విషయమన్నారు.ఇలాగే ప్రతి ఏడాది కుల,మతాలకు అతీతంగా అన్ని పండుగలను కలిసి కట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ ప్రేరణతో దేశంలోనే సూర్యాపేట జిల్లా ఆదర్శంగా నిలవలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అందులో భాగంగానే నేను,దామోదర్ రెడ్డి ఒకే వేదిక మీదకు రావడం జరిగిందన్నారు. అనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గణేశుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.భక్తులు ప్రశాంత వాతావరణంలో గణేషుడి శోభాయాత్ర నిర్వహించుకోవాలని కోరారు.సూర్యాపేట తో నాకు 40 సంవత్సరాల బంధం ఉందని,అందులో నాకు జగదీష్ రెడ్డికి 35 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు.మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అన్ని అపోహలు మాత్రమే అని అన్నారు. సూర్యాపేటలో బొడ్రాయిని పున ప్రతిష్టించాల్సిన అవసరం ఉందన్నారు.అందుకు అన్ని పార్టీల నాయకులు,ప్రజా సంఘాలు,స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాజకీయాలు ఎన్నికల వరకే అని,అందుకే సూర్యాపేటకు అన్ని మతాల పండుగలు నిర్వహించడంలో ఓ ప్రత్యేకత ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,పీస్ కమిటీ సభ్యులు,పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించిన మాజీ మంత్రులు.....

రాష్ట్రంలో అధికార పక్షం,ప్రతిపక్షం నేతల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటున్న ఈ తరుణంలో జిల్లా కేంద్రంలో ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి,ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఒకే వేదికపై ఉల్లాసంగా కనిపిస్తూ ఒకరిపై ఒకరు తమకున్న అనుబంధాలను తేల్చి చెప్పడంతో చూపరులను ఔరా..... అనిపించింది. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని తదనంతరం సాధారణ పరిస్థితుల్లోనే ఉంటామని ఆ నాయకులు చెప్పడంతో కార్యకర్తలు ఆలోచనలో పడటంతో పాటు ఒకరినొకరు తమ చెవులలో గుసగుస లాడుకుంటున్న సందర్భాలు కన్పించాయి.


Similar News