Sagar water level : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా నాగార్జునసాగర్..

ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది.

Update: 2024-08-01 14:33 GMT

దిశ, నాగార్జునసాగర్ : ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. దాంతో వరద నాగార్జున సాగర్‌ వైపు వెళ్తున్నది. జూరాలా, సుంకేశుల జలాశయాల నుంచి డ్యామ్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 3,95,162 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు.. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్టులోని జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది

539.40 అడుగులకు చేరిన సాగర్‌ నీటిమట్టం..

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 3,69,866 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్‌ ఫ్లో 27,644 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 539.40!అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 182.9534 టీఎంసీలుగా ఉన్నది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, జూరాల, ఆలమట్టి డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు.

రేపు ఎడమ కాలువకు నీటి విడుదల..

రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఇటు తెలంగాణ.. అటు ఏపీ రాష్ట్రాలకు సాగు నీరందించడంతో పాటు తాగునీటి సమస్యను తీరుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రధాన జలవనరుల్లో ఒకటైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రం 4గంటలకు నీటి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బాలు నాయక్, బి.లక్ష్మారెడ్డి తదితరులు ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదల కార్యక్రమానికి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.

సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం నుంచి భారీ వరద నీటి రాకతో సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండగా, ఎడమకాలువ ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. వానాకాలం పంటల సాగుకు నీరు ఇవ్వాలనే ఆలోచనతో అధికారులు యుద్ధప్రాతిపదికన నీటి విడుదల ప్రణాళికను రూపొందిస్తున్నారు.  

Tags:    

Similar News