హుజూర్ నగర్ ప్రభుత్వ ఐటీఐకు రూ. 41.28 కోట్లు మంజూరు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా హుజుర్ నగర్లో ఐటీఐ కాలేజ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, హుజూర్ నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా హుజుర్ నగర్లో ఐటీఐ కాలేజ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్ నగర్లో ప్రతి సంవత్సరం 110 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణను పొందేందుకు ప్రభుత్వం ఐటీఐ ఏర్పాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఐటీఐలో పాత కోర్సులతో పాటు అదనంగా 5 రకాల కొత్త ట్రేడ్లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిట్టర్ లో రెండు యూనిట్లలో 40 మంది విద్యార్థులకు విద్యనభ్యసించే అవకాశం ఉంది. రెండేళ్ల వ్యవధి ఉండే ఈ కోర్సు ను ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 2 యూనిట్లలో 40 మంది విద్యార్థులకు రెండేళ్ల విద్య, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ట్రేడ్ లో 2 యూనిట్లలో 40 మంది విద్యార్థులకు, డీజిల్ మెకానిక్ ట్రేడ్ లో 2 యూనిట్లలో 40 మంది విద్యార్థులకు, వెల్డర్ ట్రేడ్లో 2 యూనిట్లలో 30 మంది విద్యార్థులకు ఒక ఏడాది కోర్సు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఐటీఐలో ప్రభుత్వం సివిల్ పనులు, యంత్రాంగం, పరికరాలు, ట్రైనర్లు, మానవ వనరుల ఏర్పాటు కోసం అత్యవసర వ్యయం కింద రూ. 41.28 కోట్లను మంజూరు చేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంతో ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ, రోబోటిక్స్, ఆటో మెషీన్ సీఎడీ సీఎఎం, సీఎన్సీ మెషీనింగ్, అడ్వాన్స్ ప్లంబింగ్ ఆడిటివ్ మానుఫ్యాక్చరింగ్ వంటి 23 స్వల్పకాలిక కోర్సులతో పాటు న్యూ ఢిల్లీలోని జాతీయ వృత్తి శిక్షణ మండలి (ఎన్.సి.టి.వి) ఆమోదించిన ఆరు దీర్ఘకాలిక ట్రేడ్స్ లో 40 అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశ పెట్టనుందని పేర్కొన్నారు.
హుజూర్ నగర్ లో కొత్త కోర్సులతో పాటు పాత కోర్సులు 1. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటో మెషిన్, 2. ఇండస్ట్రియల్ రోబోటిక్స్ 1 ఏడాది కోర్సు, డిజిటల్ మానుఫ్యాక్చరింగ్ ఒక యేడాది కోర్సు, 3.ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్సుడ్ టూల్స్ ఒక యేడాది, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ (మెకానికల్) 2 ఏళ్ల కోర్సు, అడ్వాన్స్ డ్ సీఎన్సీ మెషీనింగ్ టెక్నీషియన్ రెండేళ్ల కోర్సు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ రెండేళ్ల కోర్సులు ఉంటాయని తెలిపారు. ఈ కోర్సుల కోసం 17 రెగ్యులర్ ఉద్యోగులను, 5 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో హుజూర్ నగర్లో ఐటీఐ ఏర్పాటు వల్ల 110 మంది విద్యార్థులకు సాంకేతిక విద్య అందుతుండడంతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.