ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి.. ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్..
దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని ఉన్న వడ్లను ఈనెల 31 వరకు కొనుగోలు చేసి పూర్తి చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
దిశ, దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని ఉన్న వడ్లను ఈనెల 31 వరకు కొనుగోలు చేసి పూర్తి చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఆర్డిఓ కార్యాలయంలో దాన్యం కొనుగోళ్ల పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ చంద్రశేఖర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన పడవద్దు, ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రతి మిల్లుకు ఒక తహసిల్దారును ఇంచార్జిగా నియమించారని ఆయన తెలిపారు. ప్రతి మిల్లుకు 150 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి పంపారని ఆయన తెలిపారు.
అలాగే ధాన్యం కొనుగోలు కోసం లారీల సంఖ్యలను పెంచాలని ఆయన ఆర్డీవోకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాల్లో హమాలీల ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలను ఆదేశించారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లపై, లారీల కాంట్రాక్టర్లపై, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెసీ చంద్రశేఖర్, ఆర్డిఓ గోపిరాం, డీఎస్పీ నాగేశ్వరరావు, ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్ రెడ్డి, మాధవరం శ్రీనివాస్ రావు, తుం నాగార్జున రెడ్డి, ముక్కమల్ల బాలయ్య, వెల్గూరి వల్లపురెడ్డి, వివిధ మండలాల తహసీల్దారు, పీఎసీఎస్ సీఓలు, మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.