రాష్ట్రంలో పంట పొలాలు ఎండి పోతున్నప్పటికీ ప్రభుత్వానికి సోయి లేదు
రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే వారికి కనీస సోయి లేకుండా పోయిందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు.
దిశ, సూర్యాపేట: రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే వారికి కనీస సోయి లేకుండా పోయిందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా వరుసగా 5వ రోజు సూర్యాపేట మండలం యార్కారం, దుబ్బ తండా, రెఖ్యా నాయక్ తండాలో ఎండిన పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని, హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు రూ. 25 నుంచి 30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని అన్నారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడు వారడానికి కారణం నూటికి నూరు శాతం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు.
పోరాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు రాలేదని ప్రశ్నించిన రైతును మంత్రి చెప్పు తీసుకుని కొడతాననడం దుర్మార్గం అన్నారు. మా ప్రభుత్వ హయాంలో రైతు తప్పిదం వలన ఒక్క మడి ఎండిపోతేనే నానా హంగామా చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండి పోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న మొసలి కన్నీళ్ళకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా పంట నష్టంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.