పంట పొలాల్లో డ్రీమ్ సిటీ వెంచర్లు
గ్రామీణ వాతావరణాన్ని రియల్ వ్యాపారులు చెర బడుతున్నారు. పంట పొలాలు కొని డ్రీం సిటీల పేరుతో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు.
దిశ, మిర్యాలగూడ: గ్రామీణ వాతావరణాన్ని రియల్ వ్యాపారులు చెర బడుతున్నారు. పంట పొలాలు కొని డ్రీం సిటీల పేరుతో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అంటూ పక్క పొలాల రైతుల రాకపోకలకు అవాంతరాలు కల్పిస్తున్నారు. లే అవుట్ నిబంధనలు అమలు చేయకుండా ప్రీ లాంచ్ పేరుతో ఏజెంట్ల సహకారంతో కాగితాల మీదనే ప్లాట్లు విక్రయించి కోట్లు దండుకుంటున్నారు. అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు తూట్లు పొడుస్తూ వెంచర్ లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అమాయక ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తూ రియల్ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు.
మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివారం భారీ హంగామాతో ఓ సంస్థ వెంచర్ ప్రారంభించింది. సర్వేనెంబర్ 107, 108, 109, 112, 113, 114లలో సుమారు 40 ఎకరాల భూమి కొనుగోలు చేసిన డ్రీం సిటీ సంస్థ 30 ఎకరాలకే తాత్కాలిక లే అవుట్ పర్మిషన్ పొందింది. వెంచర్ నిబంధనల మేరకు మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించకుండానే పట్టణానికి కూతవేటు దూరం నార్కెట్పల్లి-అద్దంకి హైవే ఆనుకొని థర్మల్ ప్లాంట్ పార్క్ ప్లే గ్రౌండ్ ల పేరుతో రంగు రంగుల కరపత్రాలు ముద్రించి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. నిబంధనల ప్రకారం లే అవుట్ అప్రూవ్ అయి రేరా అనుమతులు పొందాల్సి ఉన్నప్పటికీ బ్రోచర్లపై టీఎల్పీ నెంబర్లు చూపుతూ గజం భూమి పది వేలకు పైగా విక్రయిస్తున్నారు.
నిబంధనలు ఇలా..
వెంచర్ ఏర్పాటు చేసే సంస్థ ముందుగా తాను కొనుగోలు చేసిన భూమిలో 10 శాతం గ్రామ పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. కాలనీ వాసులకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని వీధుల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ సౌకర్యం కల్పించడంతో పాటు తాగునీటి నల్లాలు ఏర్పాటు చేసి డ్రైనేజీ కాల్వలు సైతం నిర్మించాలి. ఆ తరువాతనే ప్లాట్ లు విక్రయించాల్సి ఉన్నప్పటికీ రియల్ వ్యాపారులు నిబంధనలు విస్మరిస్తున్నారు. మౌలిక వసతులు కల్పించకుండా యథేచ్ఛగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. ప్లాట్లు విక్రయించిన అనంతరం సదరు వ్యాపారులు ముఖం చాటేసిన సందర్బాలు అనేకం ఉన్నాయి.
నిర్మాణానికి నోచుకొని పార్క్, క్రీడా ప్రాంగణం..
కిష్టాపురం గ్రామంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్ లో 400 లకు పైగా ప్లాట్ లు చేశారు. వెంచర్ ఏర్పాటు చేస్తున్న స్థలంలో ప్లాట్ల సంఖ్య విస్తీర్ణం బట్టి నివాస ప్రాంగణాల నడుమ గాలి వెలుతురూ సౌకర్యవంతంగా ఉండేందుకు విశాలమైన పార్క్, క్రీడా ప్రాంగణం నిర్మించాలి. కానీ రియల్ వ్యాపారులు అవేవి పాటించడం లేదు. అధికారులతో కుమ్మక్కయి తమకు అనుకూలంగా లేని స్థలాన్ని పార్క్‌లు గా చూపుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. హైవే ల వెంట నిర్మించే వెంచర్లు రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే రిజిస్ట్రేషన్
వెంచర్ ఏర్పాటు చేసే వారు లే అవుట్ నిబంధనలు అమలు చేయాలి. వెంచర్ ప్రాంగణంలో రోడ్డు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే ప్లాట్లు విక్రయించాలి. నిబంధనలు పాటించకుండా ప్లాట్లు విక్రయిస్తే రిజిస్ట్రేషన్ లు నిలిపివేస్తాం. ప్రజలు నిబంధనలు తెలుసుకొని ప్లాట్లు కొనుగోలు చేయాలి.:- జానకిరాములు, పంచాయతీ కార్యదర్శి, కిష్టాపురం.