కాంగ్రెస్ కు భంగపాటు తప్పదు : ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ ఎన్ని సాధ్యం కాని హామీలు ఇచ్చినా రాబోయే ఎన్నికల్లో ఓటర్ల చేతిలో భంగపాటు తప్పదని బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

Update: 2023-11-09 12:49 GMT

దిశ, చిలుకూరు: కాంగ్రెస్ పార్టీ ఎన్ని సాధ్యం కాని హామీలు ఇచ్చినా రాబోయే ఎన్నికల్లో ఓటర్ల చేతిలో భంగపాటు తప్పదని బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తన బాల్యంలో చిలుకూరు ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. చిలుకూరు మండలంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసే కమ్యూనిస్టులున్న చిలుకూరులో పెరగడంతో తనకు ప్రజాసేవపై ఆసక్తి ఏర్పడిందన్నారు. మొన్నటి వరకూ బీఆర్ఎస్ లో ఉండి పలు రకాల లబ్ధి పొందిన కొందరు నాయకులు డబ్బు సంచులకు ఆశపడి తమ వ్యక్తిగత స్వార్థం కోసం మరో పార్టీలో చేరుతున్నారని మల్లయ్య ఆరోపించారు.



వారి మాటలకు మోసపోవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఆ పథకాలన్నీ నిరంతరంగా కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటేసి మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఆయన డప్పు కొట్టి, అభిమానులతో స్టెప్పులేసి వారిలో ఉత్సాహం నింపారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరైన ఈ ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు కొండా సైదయ్య, నాయకులు కస్తూరి నర్సయ్య, అలసకాని జనార్థన్, దొడ్డా సురేష్ బాబు, బెల్లంకొండ రమణ నాగయ్య, చేపూరి వీరబాబు, కుర్ర వెంకటయ్య, అమరగాని కాశయ్య, లింగరాజు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, షేక్ పాషా, కొండా అన్నపూర్ణ, మంత్రిప్రగడ సాయికృష్ణ, ఆయా గ్రామాల పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News