ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎండిన పంటలు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.
దిశ, హాలియా: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అనుముల మండలంలోని కొట్టాల చల్మారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఎండిపోయిన వరి పైర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో రాష్ట్రంలో కరువు అలుముకుందని ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఒక తడి నీళ్లు ఇస్తే కోట్లాది రూపాయల పంటలను కాపాడే అవకాశం ఉండేదని ప్రభుత్వం ప్రణాళికలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాలువ మొదటి మేజర్‌లకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం పోలీసులను కాపలాగా పెట్టి పాలేరు రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకెళ్లారని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుల పంటలను ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని పేర్కొన్నారు.
రైతులకు సరిపడా త్రీ ఫేస్ కరెంటు ఇవ్వకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని అంతేకాకుండా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు రైతుల సమస్యల పై మాట్లాడకుండా మిల్లర్లతో కుమ్ముకై రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే లు నోముల భగత్ రమావత్ రవీంద్ర కుమార్ యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఇస్లావత్ రామచంద్రనాయక్ ఆయా మండల పార్టీల అధ్యక్షులు బీఆర్ఎస్ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.